మురారి సినిమా శాపంలా ఇన్ని ట్విస్టులా

కృష్ణవంశీ మురారి గుర్తుందిగా. అందులో మహేష్ బాబు ఫ్యామిలీలో తరానికి ఒకరు అమ్మవారి శాపం వల్ల ఏదో ఒక ప్రమాదానికి గురై చనిపోతూ ఉంటారు. చివరికి బామ్మ సంకల్పం, పూజలతో తాను ఆత్మర్పణం చేసి ఆ గండం నుంచి గట్టెక్కిస్తుంది. మహేష్ బాబు – త్రివిక్రమ్ ల కలయికను చూస్తుంటే అచ్చంగా ఇలాంటి దోషమేదైనా వెంటపడుతోందేమో అనిపిస్తోంది. అభిమానులకు గుర్తుందో లేదో కానీ వీళ్ళ మొదటి కలయిక అతడు రెండు సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకుంది. దీని వల్లే నిర్మాత మురళీమోహన్ కు బడ్జెట్ పెరిగిన విషయం ఆయనే ఇంటర్వ్యూలలో చెప్పారు.

రెండోసారి కలుసుకున్న ఖలేజా ఏకంగా మూడేళ్లు పట్టింది. ప్రొడ్యూసర్లకు ఆ భారం ఇబ్బంది పెట్టిన వైనం మీడియాలోనూ వచ్చింది. అది క్లాసిక్ గా నిలవడం వేరే సంగతి కానీ కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైన మాట వాస్తవం. ఇప్పుడు గుంటూరు కారం కోసం చేతులు కలిపారు. ముందు పోలీస్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అనుకున్నారు. తర్వాత ఫ్యామిలీ కం యాక్షన్ ఎంటర్ టైనర్ గా మారిపోయింది. ఫైట్ మాస్టర్లు అన్బు అరివు స్థానంలో రామ్ లక్ష్మణ్ లు వచ్చారు. విడుదల తేదీ ఏప్రిల్ 28, ఆగస్ట్ 11 ఆ తర్వాత జనవరి 13కి షిఫ్ట్ చేశారు. హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకుని ఆ ప్లేస్ లో శ్రీలీల, తోడుగా మీనాక్షి చౌదరి వచ్చారు.

ఛాయాగ్రహణం బాధ్యతలు మాది నుంచి వినోద్ అటు నుంచి రవి కె చంద్రన్ కు వచ్చాయి. తమన్ మారిపోయి ఆ ప్లేస్ లో హేశం అబ్దుల్ వహాబ్, భీమ్స్ వస్తారనే లీక్ ఊపందుకుంది. ఇన్ని ప్రతికూలతలు మధ్య టీజర్ ఇచ్చిన హైప్ తగ్గిపోయిన మాట వాస్తవం. త్రివిక్రమ్ గతంలో అల్లు అర్జున్ తో మూడు సినిమాలు చేసినప్పుడు వేగంగానే పూర్తి చేశారు. కానీ కావాలని చేయకపోయినా తాను ఎంతో ఇష్టపడే మహేష్ బాబుతోనే గురూజీకి బ్రేకుల పర్వం పడుతోంది. ఇలా జరగాలని ఎవరూ కోరుకోకపోయినా పైన చెప్పినట్టు ఏదో శాప ప్రభావమే. వీటికి ఎప్పుడు చెక్ పడుతుందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.