పవన్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ల కాంబోలో తెరకెక్కిన ‘బ్రో’ చిత్రం ఈ నెల 28న విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తేజూ శ్రీకాళహస్తి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వెళ్లారు. తన చిత్రం ఘన విజయం సాధించాలని ప్రార్థించారు. అయితే, ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ వివాదంలో చిక్కుకున్నారు. శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో పూజల సందర్భంగా స్వామికి సాయి ధరమ్ తేజ్ స్వయంగా హారతి ఇచ్చిన వైనం వివాదానికి దారి తీసింది. దీంతో, నిబంధనలకు విరుద్ధంగా స్వామికి హారతి ఇచ్చిన తేజూపై పండితులు, భక్తులు మండిపడుతున్నారు.
దేవుడికి హారతిచ్చేందుకు సాయి ధరమ్ తేజ్ కు అనుమతిని ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఉపాలయంలోని చంగల్ రాయ స్వామిని తేజూ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేతికి హారతి పళ్లాన్ని ఆలయ అర్చకులు ఇచ్చారు. స్వామి వారికి స్వయంగా తేజూతో అర్చకులు హారతి ఇప్పించారు. దీంతో, ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ నిబంధనలను, ఆచారాలను పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. ఇతరులు పూజలు చేయడం ఇక్కడ నిషిద్ధం అని, తేజూ ఎలా చేస్తారని కొందరు పూజారులు కూడా ప్రశ్నిస్తున్నారు.
అంతకుముందు, కడపలోని పెద్ద దర్గాలో తేజూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇది తనకు దేవుడిచ్చిన పునర్జన్మ అని అన్నారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ప్రాణమని, ఆయనతో కలిసి నటించడం జీవితంలో మరచిపోలేని అనుభూతి అని చెప్పారు. ఇది ఓ అదృష్టం అని ఆనందం వ్యక్తం చేశారు. అయితే, రాజకీయాలపై అవగాహన ఉంటేనే రాజకీయ ప్రవేశం చేయాలని పవన్ మామయ్య చెప్పారని, అటు వైపు వెళ్లే ఆలోచన తనకు లేదని అన్నారు. మరో రెండు వారాల్లో బ్రో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇలా చేశావేంటి బ్రో అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates