నాగశౌర్య బాధ.. ఆ సినిమా గురించేనా?

యువ కథానాయకుడు నాగశౌర్య ‘ఛలో’ సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించి ఒక టైంలో మంచి ఊపు మీద కనిపించాడు. వరుసగా క్రేజీ సినిమాలు లైన్లో పెట్టి తన కెరీర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా కనిపించాడు. కానీ అతను ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమాలు నిరాశ పరిచాయి. వరుస ఫ్లాపులతో ఫాలోయింగ్, మార్కెట్ దెబ్బ తీసుకుని.. ఇప్పుడు ‘రంగబలి’తో బౌన్స్ బ్యాక్ అవుదామని చూస్తున్నాడు.

ఈ సినిమా ప్రమోషన్లలో మీడియాతో మాట్లాడుతూ.. మొహమాటపడి చేసిన కొన్ని సినిమాలు తనను దెబ్బ కొట్టాయని.. అలాగే కొన్ని సినిమాల ఫలితం ఏంటో ముందే అర్థం అయిపోయిందని… ‘రంగబలి’ మాత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే ధీమాతో ఉన్నానని చెప్పాడు. కాగా తన ఫ్లాప్ సినిమాల్లో ఒకటి మాత్రం చాలా బాధ పెట్టిందని.. దాని కోసం చాలా కష్టపడ్డానని.. కానీ మేకింగ్ దశలో జరిగిన తప్పులతోనే సినిమా ఆడదని అర్థమైపోయిందని అతను గుర్తు చేసుకున్నాడు.

‘‘నేను హీరోగా చేసిన ఓ సినిమా ఘోర పరాజయాన్ని అందుకుంది. ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డా. నా బాడీని ఎంతగానో మార్చుకున్నా. కథ చెప్పినపుడు భారీ సెట్స్, ఫేమస్ ఆర్టిస్టులతో ఈ సినిమా ఉంటుందని అన్నారు. తీరా సెట్లోకి అడుగు పెట్టినపుడు భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. ‘ఇలా అయితే సినిమా ఆడదు, మీకు ఫ్లాప్ సినిమా చేయాలని ఉంటే తప్పకుండా చేద్దాం. కాకపోతే ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డా.

దీనిపై ఎంతో నమ్మకం పెట్టుకున్నా. అదే బాధగా ఉంది’ అని నిర్మాతకు నిర్మొహమాటంగా చెప్పేశా’’ అని నాగశౌర్య వెల్లడించాడు. శౌర్య తన కెరీర్లో ఎక్కువ కష్టపడి, బాడీ మార్చుకున్న సినిమా అంటే.. ‘లక్ష్య’నే. ఇందులో ఆర్చర్ పాత్ర కోసం అతను సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. ఏషియన్ మూవీస్ వాళ్లు నిర్మించిన ఈ చిత్రంలో ప్రొడక్షన్ వాల్యూస్ అంత గొప్పగా ఏమీ ఉండవు. కాబట్టి పేరు చెప్పకపోయినా నాగశౌర్య బాధంతా ఆ సినిమా గురించే అయ్యుండొచ్చు.