ఆరెక్స్ 100 రూపంలో డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ అందుకుని సెన్సేషన్ గా మారిన దర్శకుడు అజయ్ భూపతికి రెండో సినిమా మహా సముద్రం ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా అతని కొత్త చిత్రం మంగళవారం మీద మంచి బజ్ ఉంది. టైటిల్ తో పాటు ఇప్పటిదాకా వదిలిన పోస్టర్లు ఆసక్తికరంగా ఉండటంతో ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్పబోతున్నాడన్న అభిప్రాయం కలిగింది. దానికి తగ్గట్టే ఇవాళ వదిలిన టీజర్ అంచనాలు పెంచేలా ఉంది. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర పోషించిన మంగళవారం ఏ జానరో అంతు చిక్కకుండా వీడియోని తెలివిగా కట్ చేశారు.
అదో గ్రామం. ఏదో ఘాడమైన రహస్యం ఆ ఊరిని పట్టి పీడిస్తూ ఉంటుంది. దాన్ని చూసిన వారు ఎవరైనా సరే కంటి చూపు పోగొట్టుకోవడమో, ప్రాణాలు వదులుకోవడమో చేయాల్సి ఉంటుంది. ఈ సంఘటనలకు, గుడిలో వెలిసిన అమ్మవారికి అంతు చిక్కని సంబంధం ఉంటుంది. ఛేదించాలని చూసిన వారెవరికీ జరిగింది అర్థం కాదు. ఓ అమ్మాయి(పాయల్ రాజ్ పుత్)కి దీనికి సంబంధించిన జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి. అసలు అక్కడ ఏం జరిగింది, మంగళవారానికి ఈ సస్పెన్స్ కి కారణం ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానం థియేటర్ లోనే చూడాలి
విజువల్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. స్టోరీని ఎంత మాత్రం విశ్లేషించే అవకాశం ఇవ్వకుండా ఎడిట్ చేయడం అజయ్ భూపతి నైపుణ్యానికి నిదర్శనం. క్రైమ్, హారర్, థ్రిల్లర్, రొమాన్స్ అన్నీ కలగలసి కనిపిస్తున్నాయి. విరూపాక్షకి అద్భుతమైన స్కోర్ ఇచ్చిన సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ దీనికి కూడా టెర్రిఫిక్ బిజిఎం ఇచ్చినట్టు కొన్ని సెకండ్లకే అర్థమైపోయింది. శివేంద్ర ఛాయాగ్రహణం సమకూర్చారు. పాయల్ తో పాటు నందితా శ్వేత, దివ్య పిళ్ళై, అజ్మల్, అజయ్ ఘోష్, లక్ష్మణ్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, శ్రవణ్ రెడ్డి, శ్రీతేజ్ ఇతర పాత్రలు పోషించారు. మంగళవారం విడుదల తేదీ ఇంకా నిర్ణయించలేదు
Gulte Telugu Telugu Political and Movie News Updates