కథ ఒరిజినల్ కాదు అయినా ఇన్ని భాషల్లో

స్టార్ హీరో చేసిన కమర్షియల్ సినిమా హిట్టయితే దాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేయడం సర్వసాధారణం. అయితే డబ్బింగ్ జరిగి థియేటర్లో వచ్చి వెళ్ళాక మళ్ళీ తీయడం మాత్రం అరుదు. గతంలో అలా చేసినా సక్సెస్ అయినవి, ఫ్లాప్ అయినవి బోలెడున్నాయి. విజయ్ తేరి ఆరేళ్ళ క్రితమే పోలీసోడుగా దిల్ రాజు అనువాదం చేసి వదిలారు. పెద్దగా ఆడలేదు. కట్ చేస్తే దాన్నే బోలెడన్ని మార్పులతో ఉస్తాద్ భగత్ సింగ్ గా తీస్తున్నారు. దబాంగ్ ని  గబ్బర్ సింగ్ గా ఎలా అయితే ఇండస్ట్రీ హిట్ చేశాడో ఉస్తాద్ ని దానికి మించిన స్థాయిలో అందిస్తాడనే నమ్మకం అభిమానుల్లో బోలెడంత ఉంది

అసలు విషయానికి వస్తే ఇదే తేరిని హిందీలో వరుణ్ ధావన్ హీరోగా దర్శకుడు అట్లీ నిర్మాతగా మారి మరో కోలీవుడ్ డైరెక్టర్ కలీస్ తో తీయించేందుకు రంగం సిద్ధం చేశాడు. నిజానికి తేరి కథ ఇప్పటిది కాదు. 1990లో విజయ్ కాంత్ హీరోగా ఛత్రియన్ వచ్చింది. తెలుగులో క్షత్రియుడుగా డబ్ చేశారు. మణిరత్నం కథను అందించగా సుభాష్ డైరెక్ట్ చేశారు. విలన్ల చేతిలో భార్య చనిపోతే హీరో పోలీస్ ఉద్యోగం వదిలి పిల్లలతో పాటు అజ్ఞాతంలోకి వెళ్తాడు. జైలు నుంచి బయటికి వచ్చిన విలన్ మళ్ళీ ఇతన్ని ఖాకీ డ్రెస్సు వేసుకునేలా చేస్తాడు. చివరికి శత్రుసంహారంతో క్లైమాక్స్ ముగుస్తుంది.

తేరిలో యామీ జాక్సన్ చేసిన పాత్రను ఒరిజినల్ లో భానుప్రియ, సమంతా క్యారెక్టర్ ని రేవతి పోషించారు. ఇప్పుడు పవన్ సరసన శ్రీలీలతో పాటు మరో అమ్మాయిని తీసుకోబోతున్నారు. హిందీలో ఎవరనేది కన్ఫర్మ్ కాలేదు. అట్లీ ఇంత తెలివిగా క్షత్రియుడుని వాడుకోవడం రిలీజైన టైంలోనే విశ్లేషకులు పసిగట్టారు. ఇక్కడ ఆడలేదు కాబట్టి లైట్ తీసుకున్నారు. మొత్తానికి పాత క్లాసిక్స్ ని చాకచక్యంగా ఎలా వాడుకోవచ్చో చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదేమో. ఉస్తాద్ భగత్ సింగ్ తో సమాంతరంగా రిలీజ్ అయ్యేలా అట్లీ ప్లాన్ చేస్తున్నాడు కానీ పవనే ముందొచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది