చక్కగా ప్లాన్ చేసుకున్న స్పై బిజినెస్

ఎల్లుండి విడుదల కాబోతున్న స్పై ప్యాన్ ఇండియా రిలీజ్ కు సర్వం సిద్ధం చేసుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ మరీ పరుగులు పెట్టకపోయినా మౌత్ టాక్ తో మొదటి రోజు మ్యాట్నీకే కలెక్షన్లు ఊపందుకుంటాయనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది. హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాల్లో ముందస్తు అమ్మకాలు బాగున్నాయి. నార్త్ లో సత్యప్రేమ్ కి కథ వల్ల పోటీ తప్పలేదు కానీ మిగిలిన చోట్ల మాత్రం మంచి బజ్ ఉంది. ఏపీ తెలంగాణలో ఆ రోజు శ్రీవిష్ణు సామజవరగమన మాత్రమే పోటీగా ఉంది కాబట్టి స్పైకు వచ్చిన టెన్షన్ ఏమి లేదు. ఎటొచ్చి ఆదిపురుష్ ఆల్రెడీ స్లో అయిపోయింది.

బిజినెస్ పరంగానూ స్పై ప్లానింగ్ చక్కగా కనిపిస్తోంది. వరల్డ్ వైడ్ థియేటర్ హక్కులను 17 కోట్ల 50 లక్షల దాకా విక్రయించినట్టు సమాచారం. దీనిపైన ఇంకో కోటి అదనంగా షేర్ వస్తే ఈజీగా గట్టెక్కపోతుంది. స్పైకి కలిసి వస్తున్న సానుకూలంశాలు చాలా ఉన్నాయి. మొదటిది 29న బక్రీద్ నేషనల్ హాలిడే. ఆపై మూడు రోజుల లాంగ్ వీకెండ్ దక్కుతుంది. చివరి శనివారం కావడంతో బ్యాంకుల్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలకు సెలవులు ఉంటాయి. కార్పొరేట్ల సంగతి సరేసరి. పాజిటివ్ టాక్ రావడం ఆలస్యం రికవరీని తక్కువ టైంలో అంటే వారం పది రోజుల్లో ఆశించవచ్చు.

తెలంగాణలో గరిష్ఠ టికెట్ ధరలకు మొగ్గు చూపినప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో అదేమీ ఇబ్బంది కాదనే ధీమాలో స్పై బృందం ఉంది. నైజామ్ రైట్స్ కి 5 కోట్లు, సీడెడ్ 2 కోట్లు, ఓవర్సీస్ కోటి డెబ్భై ఐదు లక్షలు, ఇతర రాష్ట్రాలు70 లక్షలకు ఇచ్చారు. ఆంధ్ర ఏకంగా 6 కోట్లు పలకడం విశేషం. సుభాష్ చంద్రబోస్ అంతర్ధానం మీద యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన స్పై మీద నిఖిల్ చాలా కాన్ఫిడెంట్ గా  ఉన్నాడు. ట్రైలర్ కట్ బాగా రీచ్ అయ్యింది. ఎడిటర్ గ్యారీ దర్శకుడిగా పరిచయమవుతున్న  స్పై అడవి శేష్ గూఢచారి తరహాలో ట్రెండ్ సెట్టింగ్ హిట్టవ్వాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.