‘ఆదిపురుష్’ సినిమాకు అసలే టైం బాగా లేదు. విపరీతమైన డివైడ్ టాక్తో మొదలైన ఈ చిత్రం.. వీకెండ్ వరకు బలంగానే నిలబడ్డా.. సోమవారం నుంచి బాక్సాఫీస్ దగ్గర డల్లయిపోయింది. డివైడ్ టాక్ బాగా పని చేసి.. సినిమాకు వసూళ్లు పడిపోయాయి. మళ్లీ వీకెండ్ వస్తే తప్ప సినిమా పుంజుకునేలా లేదు. అసలే పరిస్థితి బాలేదంటే.. ఈ చిత్రానికి కొత్త కష్టాలు మొదలయ్యాయి. ‘ఆదిపురుష్’ను నిషేధించాలంటూ సినిమా వాళ్లే డిమాండ్ చేస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయం.
ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. రామాయణ గాథను కించపరిచేలా ‘ఆదిపురుష్’ తీశారంటూ ఈ సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. థియేటర్లలోనే కాక ఓటీటీల్లో కూడా ఈ సినిమాను ప్రదర్శించకుండా నిషేధం విధించాలని ఈ సంఘం డిమాండ్ చేసింది. ‘శ్రీరామ చంద్రుడిని మతాలతో సంబంధం లేకుండా అందరూ దేవుడిగా నమ్ముతారు. కొలుస్తారు. కానీ ‘ఆదిపురుష్’లో శ్రీరాముడితో పాటు రావణుడిని వీడియో గేమ్ కార్టూన్ల మాదిరి చిత్రీకరించారు.
ఇందులోని డైలాగులు భారతీయులనే కాక ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెంటనే ఈ సినిమా మీద నిషేధం విధించేలా చర్యలు చేపట్టాలి. థియేటర్లలోనే కాక ఓటీటీల్లో కూడా ఈ సినిమాను ప్రదర్శించకుండా ఆదేశాలు ఇవ్వాలి. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత అవమానకంగా తీసిన ఈ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో నటించాల్సింది కాదు. రామాయణాన్ని, రాముడిని కించపరిచేలా ఈ సినిమా తీశారు. వెంటనే దర్శకుడు ఓం రౌత్, రచయిత మనోజ్ ముంతాషిర్, నిర్మాతల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి’’ అని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.