సెలబ్రెటీలు అంతగా పాపులర్ కాని సమయంలో చేసిన వ్యాఖ్యానాలు.. వాళ్ల సోషల్ మీడియా పోస్టులు వివాదాస్పదం కొత్తేమీ కాదు. ఇప్పుడు ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ కూడా ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నాడు. అతను 2015లో వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు తన మెడకు చుట్టుకుంటోంది. ఆ ట్వీట్‌లో హనుమంతుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడన్నది అతడి మీద ఉన్న ఆరోపణ. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఓం రౌత్ ఏమన్నాడో చూద్దాం.
హనుమంతుడు చెవిటి వాడా? మా భవనంలో జనాలు అలాగే అనుకుంటున్నట్లున్నారు. హనుమాన్ జయంతికి విపరీతమైన శబ్ధంతో పాటలు పెడుతున్నారు. అది కూడా సంబంధం లేని పాటలు.. అని ఓం రౌత్ పేర్కొన్నాడు. అది 2015 ఏప్రిల్ 4న చేసిన ట్వీట్. అప్పటికే అతను దర్శకుడిగా ఒక సినిమా తీశాడు. లోకమాన్యః ఏక్ యుగ్ పురుష్ పేరుతో వచ్చిన ఆ చిత్రం మరాఠీలో తెరకెక్కింది. అప్పటికి ఓం రౌత్ అంత పాపులర్ కాదు. కానీ 2020లో వచ్చిన తానాజీ సినిమాతో ఓం పేరు మార్మోగింది. ఆ తర్వాత అతను ఆదిపురుష్ లాంటి మెగా మూవీని డైరెక్ట్ చేశాడు.
హనుమంతుడు చెవిటివాడా అంటూ కించపరిచేలా వ్యాఖ్యానించిన రౌత్ ఇప్పుడు.. రామాయణం మీద సినిమా తీసి, హనుమంతుడికి ఒక సీట్ అంటూ పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తున్నాడంటూ అతడి మీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. సినిమాలో హనుమంతుడి డైలాగుల విషయంలోనూ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఐతే తన ట్వీట్‌లో ఓం తప్పుగా ఏమీ మాట్లాడలేదని.. హనుమంతుడిని కించపరచలేదని కొందరు తనకు మద్దతుగా నిలుస్తున్నారు. కానీ తప్పేమీ లేకుంటే ఆ ట్వీట్‌ను ఓం ఎందుకు డెలీట్ చేశాడని తన వ్యతిరేకులు ప్రశ్నిస్తున్నారు.