వేసవి మొత్తం డ్రైగా గడిచిపోయిన బాక్సాఫీస్ కు ఆదిపురుష్ ఎక్కడ లేని ఉత్సాహం తీసుకొస్తున్నాడు. ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు అధికంగా అడ్వాన్స్ బుకింగ్స్ పోటెత్తడం ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది. ప్రభాస్ ఇమేజ్ తో పాటు రాముడు సెంటిమెంట్ మేజిక్ చేస్తుందని అంచనా వేసినా మరీ ఈ స్థాయిలో కాదని ఒప్పుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో అమ్మకాల అరాచకం మాములుగా లేదు. నాలుగు వందలకు పైగా స్క్రీన్లు తక్కువ పడుతున్నాయంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీకెండ్ మొత్తం ఇదే ట్రెండ్ ఉండబోతోంది.
నార్త్ సైడ్ ప్రేక్షకులు ఆదిపురుష్ పట్ల విపరీతమైన ఎగ్జైట్ మెంట్ తో ఉన్నారు. టాక్ ఏ మాత్రం పాజిటివ్ గా వచ్చినా పఠాన్, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 రికార్డులు ఈజీగా లేచిపోతాయి. తెల్లవారుఝామున 4 గంటల నుంచి బెనిఫిట్ షోలు తెలంగాణలో మొదలుకాబోతున్నాయి. ఏపీలో ఇంకా స్పష్టత లేని కారణంగా ప్రస్తుతం 6 కన్నా ముందు ప్రీమియర్లు పడే సూచనలు కనిపించడం లేదు. ఎన్నో నెలల తర్వాత టికెట్ల కోసం తమ ఫోన్లు నాన్ స్టాప్ గా మోగుతున్నాయని బయ్యర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ యజమానులు కాల్స్ కి స్పందించడం కూడా మానేశారు
ఇప్పుడు అందరి దృష్టి టాక్ మీదే ఉండబోతోంది. ముందస్తుగానే ఇన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తుండటంతో ఫలితం కూడా మెరుగ్గా వస్తుందనే నమ్మకం డార్లింగ్ ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. ట్రైలర్ లో చూసింది నాలుగైదు నిమిషాల కంటెంటే కాబట్టి అసలైన మూడు గంటల నిడివిలో హీరో ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్ లు కనికట్టు చేసి ఉంటారని నమ్ముతున్నారు. ఫస్ట్ డే ఓపెనింగ్స్ కి సంబంధించిన ఫిగర్లు కూడా చాలా షాకింగ్ గా ఉండబోతున్నాయి. రేపు ట్విట్టర్, ఇన్స్ టా, ఫేస్ బుక్ వగైరా సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ అన్నీ జై శ్రీరామ్ నినాదంతో మారుమ్రోగిపోవడం ఖాయమే