ఈ రోజుతో తెలుగు రాష్ట్రాల వేసవి సెలవులు అధికారికంగా ముగిసిపోయాయి. స్కూళ్ళు, కాలేజీలు తెరుచుకున్నాయి. సమ్మర్ సీజన్ ఎప్పుడు లేనంత బ్యాడ్ గా 2023లో టాలీవుడ్ చవిచూసింది. మాములుగా ఈ టైంలో రెండు మూడు నెలలు థియేటర్లు మంచి ఆక్యుపెన్సీతో కళకళలాడాలి. కానీ దానికి భిన్నంగా చోట్ల విపరీతంగా షోలు రద్దయిన పరిస్థితి గత వారం పది రోజులుగా మరీ తీవ్రంగా కనిపిస్తోంది . హైదరాబాద్ లాంటి నగరాలూ దీనికి భిన్నంగా ఏమీ లేవు. థియేటర్ అద్దెలు, కరెంటు బిల్లులు, జీతాలకు సరిపడా మొత్తం కూడా వసూలు కాలేని స్క్రీన్లు వందల్లో ఉన్నాయి
ఏప్రిల్ నుంచి జూన్ వరకు వేసవి సీజన్ గా తీసుకుంటే రావణాసురతో మొదలైన డిజాస్టర్ బోణీ మొన్న టక్కర్ వరకు కొనసాగింది. మీటర్ లాంటి చిన్న సినిమాలు సైతం కనీస బిజినెస్ ని రికవరీ చేయలేకపోగా శాకుంతలం తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఒక్క విరూపాక్ష మాత్రమే ట్రూ బ్లాక్ బస్టర్ గా వంద కోట్ల వసూళ్లను దాటేసిన నెంబర్ వన్ గా నిలుచుంది. ఒకే రోజు వచ్చిన రామబాణం, ఉగ్రంలు లాభాలు వచ్చేలా పెర్ఫార్మ్ చేయలేకపోయాయి. అల్లరోడి మూవీ పర్వాలేదనిపించుకున్నా జనాన్ని రప్పించలేకపోయింది. ఇక కస్టడీ, అన్నీ మంచి శకునములే గురించి చెప్పడానికేం లేదు
అహింస, నేను స్టూడెంట్ సర్ నిరాశపరచడంలో పోటీపడగా మేం ఫేమస్ మెరుగ్గా ఆడినా అది నైజామ్ కే పరిమితమయ్యింది. పరేషాన్, ఇంటింటి రామాయణంలకు తెలంగాణ సెంటిమెంట్ అద్దినా వర్కౌట్ కాలేదు. అన్ స్టాపబుల్ డిజాస్టర్ కాగా విమానం ఎమోషనల్ గా ఉన్నా జనానికి ఎక్కలేదు. ఒక్క బిచ్చగాడు 2, 2018 మాత్రమే ఈ ఎండల్లో లాభాలిచ్చాయి. ఇవి డబ్బింగ్ చిత్రాలు కావడం ఫైనల్ ట్విస్ట్. ప్యాన్ ఇండియాలన్నీ టపా కట్టాయి. సమ్మర్ కన్నా ముందు వచ్చిన బలగం, దసరాలే లాంగ్ రన్ దక్కించుకున్నాయి. ఆదిపురుష్ చేయబోయే అద్భుతాల మీదే అందరి ఆశలన్నీ