స్పై విడుదల విషయంలో ఏర్పడ్డ సందిగ్దత ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. జూన్ 29న ఈ ప్యాన్ ఇండియా మూవీ రిలీజ్ ని ఎప్పుడో లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఆదిపురుష్ తో కేవలం రెండు వారాల గ్యాపే ఉన్నప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో నిర్మాత రాజశేఖర్ రెడ్డి ముందుకెళ్లడానికే నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పటిదాకా పూర్తి స్థాయి ప్రమోషన్లు మొదలుకాలేదు. నిన్న మొదటి ఆడియో సింగల్ హఠాత్తుగా వచ్చేసినా రోజు దాటేలోపే రెండు మిలియన్ల వ్యూస్ దాటేసి జనంలో దీని పట్ల ఆసక్తి ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేసింది.
అయితే దాని లింక్ నిఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. పబ్లిసిటీకి తగినంత వ్యవధి లేని కారణంగా ఓ పది పదిహేను రోజులు ఆలస్యమైనా ఇండియా వైడ్ ప్రమోషన్లు చేయాలని తన ఆలోచన. కానీ ప్రొడ్యూసర్ థియేటర్ హక్కులు ఎప్పుడో అమ్మేశారు. అమెజాన్ ప్రైమ్ తో ఓటిటి ఒప్పందం జరిగిపోయింది. ఇప్పుడు డేట్ మారిస్తే అగ్రిమెంట్ ప్రకారం కొంత సొమ్ము నష్టపోవాల్సి ఉంటుంది. బయ్యర్ల దగ్గర తీసుకున్న అడ్వాన్స్ కి వడ్డీ భరించాల్సి వస్తుంది. టేబుల్ ప్రాఫిట్ మీద ఉన్నప్పుడు ఇలా చేయడం ఆయనకేమో ఇష్టం లేదు. మంచి కంటెంట్ కి హడావిడి ఎందుకనేది నిఖిల్ ఆలోచనగా కనిపిస్తోంది.
ఇంకొంత ప్యాచ్ వర్క్ తో పాటు పాట పెండింగ్ ఉందని ఇన్ సైడ్ టాక్ కానీ అఫీషియల్ గా ఎలాంటి సమాచారం లేదు. వీలైనంత త్వరగా ఈ ఇష్యూని సెటిల్ చేసుకోవాలి. ఒకవేళ ఆరు నూరైనా 29నే రిలీజ్ చేయాలంటే డబ్బింగ్ పార్ట్ కి నిఖిల్ సహకారం లేకుండా ఏదీ జరగదు. దీని వల్లే నిఖిల్ నిర్మాత మధ్య వాతావరణం కాస్త గరంగరంగా ఉందని వినికిడి. కార్తికేయ 2తో నేషన్ వైడ్ వచ్చిన ఇమేజ్ స్పైకి చాలా హెల్ప్ అవుతుందని నిఖిల్ నమ్మకంగా ఉన్నాడు. మరి ఈ సమస్య పరిష్కారమై 29నే వస్తుందా లేదా నిఖిల్ పట్టుదల పోస్ట్ పోన్ వైపు దారి తీస్తుందానేది ఆసక్తికరంగా మారింది