థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసిన షాహిద్ కపూర్ కొత్త సినిమా బ్లడీ డాడీ నిన్నటి నుంచి జియో సినిమాలో ఉచితంగా స్ట్రీమ్ అవుతోంది. చందా కట్టకపోయినా సరే ఫ్రీగా చూసేయొచ్చు. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్లకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు కావడంతో దీని మీద అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ చూశాక మంచి యాక్షన్ డ్రామాని ఎంజాయ్ చేయొచ్చని అందరూ అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఈ హీరో కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా విమర్శకులు దీన్ని ఏకేస్తున్నారు. ఒకవేళ బిగ్ స్క్రీన్ మీద వచ్చి ఉంటే మూడు రోజులకే టపా కట్టేసేదని అంటున్నారు
కథ సంగతి చూద్దాం. నార్కోటిక్స్ ఆఫీసర్ సుమేర్ ఆజాద్(షాహిద్ కపూర్) యాభై కోట్ల విలువైన డ్రగ్స్ ని తన తెగింపుతో పట్టుకుంటాడు. ఈ క్రమంలో విలన్ గ్యాంగ్ లో సభ్యుడు చనిపోతాడు. అయితే అంత మాల్ ని వదులుకోవడం ఇష్టం లేని మాఫియా డాన్ సికందర్(రోనిత్ రాయ్) సుమేర్ కొడుకుని కిడ్నాప్ చేసి బేరం పెడతాడు. దీంతో డ్రగ్స్ బ్యాగ్ తో వాళ్ళను కలిసేందుకు సుమేర్ సిద్ధపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది స్టోరీ. ఇది హాలీవుడ్ మూవీ స్లీప్ లెస్ నైట్ కి రీమేక్. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని 2015లో కమల హాసన్ చీకటి రాజ్యం తీశారు. అది కూడా ఫ్లాప్ బొమ్మే.
తిరిగి ఎనిమిదేళ్ల తర్వాత అదే కథలో ఈ బ్లడీ డాడీ వచ్చింది. బోర్ కొట్టించే స్క్రీన్ ప్లే, విసిగించే సన్నివేశాలతో అలీ అబ్బాస్ జాఫర్ పెద్ద పరీక్షే పెట్టాడు. లైన్ చాలా చిన్నది కావడంతో రెండు గంటల సేపు సాగదీయడానికి అవసరం లేని సరుకంతా ఇరికించేసరికి ఎంత వద్దనుకున్నా సరే చేతి వేళ్ళు ఫార్వార్డ్ బటన్ ని నొక్కుతూనే ఉంటాయి. మన ఆడియన్స్ సెన్సిబిలిటీస్ కి తగ్గట్టు మార్పులు చేయకుండా ఒరిజినల్ ని గుడ్డిగా ఫాలో కావడం బ్లడీ డాడీలో జరిగిన అతి పెద్ద పొరపాటు. టెక్నికల్ వంక పెట్టేందుకు లేకపోయినా కంటెంట్ మాత్రం బ్యాడ్ స్టాంప్ తో దభాలున కింద పడింది