బిఫార్మసి కుర్రాడి సరదా రంగబలి

టాలెంట్ అందం రెండూ ఉన్నా ఈ మధ్య లక్ కలిసి రాక బ్లాక్ బస్టర్ అందుకోలేకపోతున్న నాగ శౌర్య ఆశలన్నీ రంగబలి మీదే ఉన్నాయి. ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి ఫలితం చూశాక ఆషామాషీ కథలతో వర్కౌట్ కాదని గుర్తించి ఈసారి క్యారెక్టర్ పరంగా కొత్త మేకోవర్ కి వెళ్ళిపోయాడు. పవన్ బసంశెట్టి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ వచ్చే నెల జూలై 7న విడుదల కానుంది. ప్రభాస్ కు బుజ్జిగాడు ఎలాగైతే డిఫరెంట్ ఆర్క్ ఇచ్చిందో రంగబలి తనకూ అలా అవుతుందని శౌర్య నమ్మకం. టీజర్ ద్వారా ఆ క్లారిటీ ఇచ్చినట్టేనా చూద్దాం.

మెడికల్ షాపు నడుకునే ఓ మధ్యతరగతి తండ్రి(గోపరాజు రమణ)కి జులాయికి తిరిగే ఒక కొడుకు(నాగశౌర్య). బిఫార్మసీ చదివినా దుకాణానికి వచ్చిన కస్టమర్లకు సరైన మందులు ఇవ్వలేనంత జ్ఞానం ఇతనిది. ఓ మెడికో స్టూడెంట్(యుక్తి తరేజా)ని చూసి తొలి చూపులోనే ప్రేమించేసి వెంటపడతాడు. ఎప్పుడూ అంటుకుని ఉండే ఓ ఫ్రెండ్(సత్య) హీరో బేవార్స్ తనంలో తోడుగా ఉంటాడు. ఇలా సరదాగా సాగిపోతున్న జీవితంలోకి ఓ విలన్(షైన్ టామ్ చాకో)ఎంట్రీ ఇస్తాడు. దీంతో ప్రమాదాలు గొడవలు మొదలవుతాయి. ఆ తర్వాత జరిగేది తెలుసుకోవాలంటే ఓ నెల ఆగాల్సిందే

మాస్ టచ్ ఇచ్చిన ఫన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన రంగబలికి తాడేపల్లిగూడెంకి చెందిన పవన్ బసంశెట్టి దర్శకుడు. ఒక కమర్షియల్ ప్యాకేజీగా తీర్చిదిద్ది హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోంది. నాగశౌర్య బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంది. రొటీన్ లవర్ బాయ్ పాత్రలా కాకుండా క్యారెక్టర్ కి మాస్ టచ్ ఇవ్వడంతో ఛలో నాటి చలాకీతనం కనిపిస్తోంది. సినిమా కూడా పూర్తిగా ఇలాగే ఉంటే కుర్రాడు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హిట్టు దక్కినట్టే. యుక్తి లుక్స్ బాగున్నాయి. సత్య కామెడీ హెల్ప్ అయ్యేలా ఉంది. మురళీశర్మ లాంటి ఒకరిద్దరిని తప్ప క్యాస్టింగ్ ని ఎక్కువ రివీల్ చేయలేదు