ఓటిటి దెబ్బకు థియేటర్లు మూసేశారు

నెల రోజుల క్రితం కేరళలో విడుదలై ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన 2018 ఓటిటిలో రావడం అక్కడి డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్ల నుంచి తీవ్ర నిరసన ఎదురుకుంటోంది. థియేటర్లలో బాగా ఆడుతున్న టైంలోనే హటాత్తుగా సోనీ లివ్ జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించడం ఒక్కసారిగా కలెక్షన్లను తీవ్రంగా ప్రభావితం చేసింది. నూటా యాభై కోట్లకు పైగా వసూళ్లతో మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి అగ్ర హీరోలను అవలీలగా క్రాస్ చేసిన బ్లాక్ బస్టర్ ని ఇంత త్వరగా డిజిటల్ కు ఇవ్వడం పట్ల ట్రేడ్ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఏకంగా స్ట్రైక్ లకు పిలుపునిచ్చాయి.

రేపు ఎల్లుండి అంటే జూన్ 7, 8 తేదీల్లో మల్లువుడ్ నిర్మాతల వైఖరికి నిరసనగా థియేటర్లన్నీ మూసేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్న టికెట్లకు రీ ఫండింగ్ జరిగిపోతోంది. కనీసం నలభై అయిదు రోజుల గ్యాప్ లేకుండా ఓటిటిలకు కొత్త సినిమాలను ఇవ్వడం వల్లే యావరేజ్ సినిమాలను జనం హాలుకు వచ్చి చూడటమే మానేశారని వాపోతున్నారు. ఈ మధ్య కాలంలో దుల్కర్ సల్మాన్, ఫర్హాద్ ఫాసిల్ నటించిన రెండు చిత్రాల్లో కంటెంట్ యావరేజ్ గా ఉన్నా రెండో రోజే కలెక్షన్లు పడిపోయాయి. కారణం వాటి ఓటిటి డేట్లు ముందే మీడియా ద్వారా లీకైపోవడం

దీన్ని ఇక్కడితో ఆపమని, వేగంగా ఓటిటిలకు సినిమాలు అమ్మేసే నిర్మాతలకు బ్యాన్ చేసేందుకు కూడా వెనుకాడమని పంపిణీదారులు హెచ్చరిస్తున్నారు. గతంలో ఇలాగే రెండు మూడు సార్లు ఇలాంటి కార్యక్రమాలు చేసి మళ్ళీ మొదటికే వచ్చిన బయ్యర్లు ఈసారి మాత్రం తగ్గమంటున్నారు. 2018 మేకర్స్ మాత్రం ఇంత అనూహ్య విజయం తాము ఊహించలేదని, ఒకవేళ అలా అనిపించి ఉంటే ఖచ్చితంగా అగ్రిమెంట్ ని రెండు నెలలకు చేసుకునేవాళ్లమని అంటున్నారట. చూస్తుంటే ఈ పరిణామాలు సంచలనాత్మకమైన నిర్ణయాలకు దారి తీసేలా ఉన్నాయి. ఈ పరిస్థితి దక్షిణాది వుడ్స్ అన్నింటికి వచ్చేలా ఉంది