మెగాస్టార్ చిరంజీవి లాంటి డ్యాన్సర్ తెలుగు సినిమా కాదు.. ఇండియన్ సినిమా కాదు.. ప్రపంచ సినిమా చరిత్రలోనే ఉండడు అంటే అతిశయోక్తి ఏమీ కాదు. చిరును మించి వేగంగా డ్యాన్స్ చేసేవాళ్లు, అత్యంత కష్టమైన స్టెప్పులు వేసే వాళ్లు ఉండొచ్చు. కానీ ఆయనంత అందంగా, చూడముచ్చటగా నృత్యం చేయడం ఇంకెవరికీ సాధ్యం కాదు. ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా, దేశంలో నంబర్ వన్ డ్యాన్స్ మాస్టర్‌గా పేరున్న ప్రభుదేవా సైతం చిరును మించిన డ్యాన్సర్ లేడని అంటాడు.
చిరు నృత్య ప్రతిభను చెప్పడానికి కోకొల్లలుగా ఉదాహరణలు ఉన్నాయి. సినిమాల్లో పదేళ్ల విరామం వచ్చినా.. వయసు 60 దాటినా రీఎంట్రీలో ఖైదీ నంబర్ 150 సినిమాలో తనదైన గ్రేస్ చూపించడం చిరుకే చెల్లింది. ఐతే ఎంతైనా వయసు పెరిగే కొద్దీ డ్యాన్సుల్లో స్పీడు తగ్గడం మామూలే. చిరు నృత్యంలో కూడా ఈ మధ్య కొంచెం వేగం తగ్గింది.
తాజాగా చిరు కొత్త సినిమా భోళా శంకర్ నుంచి భోళా మేనియా పాట రిలీజైంది. మంచి బీట్ ఉన్న పాటే ఇచ్చాడు మణిశర్మ తనయుడైన యువ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్. లిరికల్ వీడియోలో చిరు వేసిన రెండు స్టెప్స్ కూడా చూపించారు. అవి సింపుల్‌గా ఉంటూనే చిరు ప్రత్యేకతను చూపించాడు. ఆ స్టెప్పులకు తనదైన గ్రేస్ జోడించి చిరు అభిమానులను అలరించాడు. కానీ కొందరేమో చిరు డ్యాన్సుల్లో వేగం తగ్గిందని కామెంట్లు చేస్తున్నారు. ఐతే చిరు వయసిప్పుడు 67 ఏళ్లు అన్న సంగతి మరువరాదు.
మామూలుగా ఈ వయసులో లేచి తిరగడమే కష్టమవుతుంది మామూలు జనాలకు. సినిమాల్లో ఉన్న వాళ్లు కూడా ఈ వయసుకు వస్తే డ్యాన్సులు, ఫైట్లు అన్నీ పక్కన పెట్టి సింపుల్ క్యారెక్టర్లు చేస్తుంటారు. కానీ చిరు ఈ వయసులో కూడా ఫిట్‌గా ఉంటూ.. కుర్రాడిలా ఉత్సాహం చూపిస్తున్నాడు. ఇంకా డ్యాన్సులు, ఫైట్లతో అభిమానులను అలరించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ వయసులో ఇంత కష్టపడుతున్న హీరో ఏ ఇండస్ట్రీలోనూ కనిపించడదు. అందుకు ఆయన్ని కొనియాడాల్సింది పోయి కంప్లైంట్లు చేయడమేంటో?