నిఖిల్ నుంచి మ‌రో భారీ చిత్రం

యువ క‌థానాయ‌కుడు నిఖిల్ ఇప్పుడు మామూలు ఊపులో లేడు. గ‌త ఏడాది కార్తికేయ‌-2 పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బ‌స్ట‌ర్ అయి అత‌డి మార్కెట్‌ను ఊహించని స్థాయిలో విస్త‌రించ‌డంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌న‌తో సినిమాలు చేయ‌డానికి పోటీ ప‌డుతున్నారు. 18 పేజెస్ లాంటి ప్రేమ‌క‌థా చిత్రం కూడా ఉన్నంత‌లో మంచి ఫ‌లితాన్నే అందుకుంది.

త్వ‌ర‌లో విడుద‌ల కానున్న స్పై మూవీ.. టీజ‌ర్‌తో బాగానే అంచ‌నాలు పెంచింది. ఇటీవ‌లే ది ఇండియా హౌస్ అనే మ‌రో భారీ పాన్ ఇండియా సినిమాను అనౌన్స్ చేశారు నిఖిల్ హీరోగా. ఇంత‌లోనే నిఖిల్ హీరోగా తెర‌కెక్క‌నున్న ఇంకో పెద్ద సినిమా గురించి అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. ఇంత‌కుముందు నిఖిల్‌తో అర్జున్ సుర‌వ‌రం చిత్రాన్ని నిర్మించిన ఠాగూర్ మ‌ధు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

భ‌ర‌త్ కృష్ణ‌మాచారి అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగు పెడుతున్నాడు. అత‌ను త‌మిళంలో కొన్ని సినిమాల‌కు ర‌చ‌యిత‌గా ప‌ని చేశాడు. నిఖిల్ హీరోగా ఒక చారిత్ర‌క నేప‌థ్య‌మున్న సినిమాను అత‌ను తెర‌కెక్కించ‌నున్నాడు. ఒక ఖ‌డ్గం త‌ర‌హాలో ఉన్న ఆయుధంతో ఈ సినిమా ప్రి లుక్‌ను ఆస‌క్తిక‌రంగా డిజైన్ చేశారు. గురువారం ఈ సినిమా టైటిల్, ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేయ‌బోతున్నారు.

స్పై, ది ఇండియా హౌస్ సినిమాల్లాగే ఇది కూడా తెలుగు, తమిళం, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో తెర‌కెక్క‌నుంది. మ‌నోజ్ ప‌ర‌మ‌హంస‌, ర‌వి బ‌స్రూర్ (కేజీఎఫ్ ఫేమ్‌) లాంటి టాప్ టెక్నీషియ‌న్లు ఈ సినిమాకు ప‌ని చేయ‌నున్నారు. బింబిసార ర‌చ‌యిత వాసుదేవ్ మునెప్ప‌గారి ఈ చిత్రానికి మాట‌లు రాస్తున్నాడు. చూస్తుంటే ఇప్పుడు చేస్తున్న‌, చేయ‌బోయే సినిమాల‌తో నిఖిల్ రేంజే మారిపోయేలా ఉంది.