నేను చ‌నిపోలేదు.. ఇంకో సెల‌బ్రెటీ క్లారిటీ

ఈ సోష‌ల్ మీడియా కాలంలో ప్ర‌తి విషయాన్నీ సెన్సేష‌న‌ల్ చేయ‌డానికి చూసే నెటిజ‌న్ల బ్యాచ్ ఒక‌టి ఉంటుంది. వీళ్ల‌కు సెల‌బ్రెటీల‌ను బ‌తికుండ‌గానే చంపేసి.. ఆ వార్త‌ల‌ను వైర‌ల్ చేసుకుని పాపుల‌ర్ అవ్వ‌డం ఒక ఆట‌. ఇలాంటి వార్త‌లు ఆ సెల‌బ్రెటీల‌ను, వారి కుటుంబీకుల‌ను ఎంత‌గా బాధ పెడ‌తాయో కాస్త‌యినా ఆలోచించ‌రు. వేణుమాధ‌వ్, కోట శ్రీనివాస‌రావు, చంద్ర‌మోహ‌న్, శ‌ర‌త్ బాబు.. ఇలా ఎంతోమంది సెల‌బ్రెటీలు ఈ బాధ‌ను అనుభ‌వించిన వారే.

శ‌ర‌త్ బాబు ఈ మ‌ధ్య విష‌మ స్థితికి చేరుకోగా.. ఆయ‌న బ‌తికుండ‌గానే చ‌నిపోయిన‌ట్లు పేరున్న హ్యాండిల్స్ కూడా ట్వీట్లు వేసేశాయి. త‌ర్వాత ఆ వార్త నిజం కాద‌ని తెలిసింది. రెండు రోజుల కింద‌ట శ‌ర‌త్ బాబు నిజంగానే చ‌నిపోయినా జ‌నాలు న‌మ్మ‌ని ప‌రిస్థితి వ‌చ్చిందంటే.. అందుకు అంత‌కుముందు జ‌రిగిన అబ‌ద్ధ‌పు ప్ర‌చార‌మే కార‌ణం. శ‌ర‌త్ బాబు అనుభ‌వం త‌ర్వాత ఇంత‌లోనే మ‌రో సెల‌బ్రెటీకి చేదు అనుభ‌వం త‌ప్ప‌లేదు.

90వ ద‌శ‌కంలో తెలుగు ప్రేక్ష‌కుల‌ను న‌వ్వుల్లో ముంచెత్తిన సీనియర్ క‌మెడియ‌న్ సుధాక‌ర్ చ‌నిపోయారంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో ఆయ‌న స్వ‌యంగా తాను బ‌తికే ఉన్నానంటూ వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. సుధాక‌ర్ ఆరోగ్య పరిస్థితి విష‌మించింద‌ని.. ఆయ‌న ఐసీయూలో ఉన్నార‌ని ముందు వార్త‌లు రాగా.. ఆ త‌ర్వాత ఆయ‌న చ‌నిపోయిన‌ట్లు ఎవ‌రో వార్త‌లు పుట్టించారు.

దీనిపై ఒక వీడియో ద్వారా సుధాక‌ర్ వివ‌ర‌ణ ఇచ్చారు. త‌న గురించి వ‌స్తున్న వార్త‌లు నమ్మ‌కండ‌ని.. తాను ఆరోగ్యంగా, సంతోషంగానే ఉన్నాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఒక ప‌దేళ్ల పాటు తెలుగు సినిమా కామెడీలో త‌న‌దైన ముద్ర వేసిన సుధాక‌ర్.. ఆ త‌ర్వాత డౌన్ అయిపోయారు. మ‌ధ్య‌లో తాగుడుకు బానిస అయి ఆరోగ్యాన్ని దెబ్బ తీసుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.