వరుస ఫెయిల్యూర్లు ఎలాంటి వ్యక్తి ఆత్మవిశ్వాసాన్నయినా దెబ్బ తీస్తాయి. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఇంకెవరూ చేయనన్ని ప్రయోగాలు చేసి.. ఎంతోమంది కొత్త వాళ్లకు అవకాశమిచ్చి అద్భుత ఫలితాలు రాబట్టిన అక్కినేని నాగార్జున సైతం ఈ మధ్య బాగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారు. కథలు, దర్శకుల ఎంపికలో పొరపాట్లు ఆయన కెరీర్‌ను కిందికి లాగేశాయి. ‘ది ఘోస్ట్’తో ఆయన పతనంలో కొత్త లోతులను చూశారు. ఈ దెబ్బతో తర్వాతి సినిమా విషయంలో ఆయనలో ఎక్కడలేని అయోమయం మొదలైంది.
ముందు అనుకున్న ప్రకారం అయితే.. రైటర్ ప్రసన్న కుమార్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ మలయాళ రీమేక్‌లో నటించాలన్నది నాగ్ ఆలోచన. కథ ఓకే చేశారు. నిర్మాత (శ్రీనివాసా చిట్టూరి) కుదిరాడు. ఇక ముహూర్త వేడుకే తరువాయి అనుకున్న టైంలో నాగ్ ఆలోచన మారింది. తనకు తోడు తన కొడుకులిద్దరూ కూడా పెద్ద ఫెయిల్యూర్లు ఎదుర్కొని అక్కినేని లెగసీనే ప్రమాదంలో పడటంతో నాగ్.. ఈ సారి చిన్న తప్పు చేయడానికి కూడా ఆస్కారం లేకపోయింది.
కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టి తన సత్తాను చాటిచెప్పాల్సిన స్థితిలో స్క్రిప్టు విషయంలో మళ్లీ తర్జన భర్జనలు మొదలయ్యాయి. అంతే కాక ఒక దశలో దర్శకుడిని మార్చేయాలన్న చర్చ కూడా జరిగింది. ‘కస్టడీ’ రిలీజ్ టైంలో నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మీడియాతో మాట్లాడుతూ.. ప్రసన్ననే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని చెప్పలేం అన్నట్లుగా మాట్లాడాడు.
ఐతే గత కొన్ని రోజుల చర్చల అనంతరం ఈ డైలమా నుంచి నాగ్ బయటికి వచ్చేశాడట. సినిమా చూపిస్త మావ మొదలుకుని ధమాకా వరకు ప్రసన్న కుమార్ జైత్రయాత్ర చూస్తే.. అతడికి కమర్షియల్ అంశాలు.. జనాల అభిరుచిపై ఉన్న పట్టును చూసి.. తనకు దర్శకుడిగా అవకాశం ఇవ్వడంలో తప్పులేదని నాగ్ అండ్ టీం ఫిక్సయిందట. అలాగే స్క్రిప్టు విషయంలో మరింత కసరత్తు జరిగి.. మాతృకకు చేసిన మార్పులు చేర్పుల విషయంలో నాగ్ సంతృప్తిగా ఉన్నాడని.. జూన్ మధ్యలో షూట్‌కు వెళ్లిపోదామని కూడా చెప్పేశాడని.. అంతకంటే ముందు ముహూర్త వేడుక కూడా చేయబోతున్నారని సమాచారం.