హరీష్ శంకర్ చురకలు గట్టిగానే తగిలాయి

తెలుగు సినిమాని ఎవరు చులకన చేసినా తప్పే. ఎందుకంటే ఆస్కార్ స్టేజి దాకా మన ప్రతిభ ఎదిగిన తరుణంలో తక్కువ చేసి మాట్లాడ్డం సబబనిపించుకోదు. దానికి మీడియా సైతం అతీతం కాదు. మలయాళం బ్లాక్ బస్టర్ 2018 తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదల సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో నిర్మాత బన్నీ వాస్ కి ఓ ప్రశ్న ఎదురయ్యింది. టాలీవుడ్లో ఇంత గొప్ప చిత్రాలు ఎవరూ తీయడం లేదు మన దర్శకులు అలా ఆలోచించడం లేదని మీకనిపించిందా అంటూ ఒక జర్నలిస్ట్ అడిగారు. వాస్ వెంటనే దీనికి హరీష్ శంకర్ అయితే సరిగ్గా సమాధానం చెప్పగలరని మైకు ఆయనకిచ్చేశారు.

సరైన కౌంటరే వచ్చింది. అసలు ప్రపంచం మొత్తం తెలుగు దర్శకుల వైపు చూస్తుంటే ఇప్పుడు మనం అలాంటివి తీయలేమా అంటూ అడగడంలో అర్థం లేదని, ఆర్ఆర్ఆర్ కెజిఎఫ్ లు డబ్బింగ్ అని హిందీలో చూడటం మానేశారా, వరల్డ్  మూవీ అరచేతుల్లోకి వచ్చాక ఇంకా మనం మధ్యలో గీతలు గీయడంలో అర్థం లేదని నేరుగా సదరు ప్రతినిధి పేరు ప్రస్తావించి మరీ చురకలు వేశారు. హరీష్ శంకర్ అన్నదాంట్లో పాయింట్ ఉంది. ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితమే శంకరాభరణం లాంటి క్లాసిక్స్ రష్యా తదితర దేశాల్లో ప్రదర్శించారు. కేరళలో వంద రోజులు ఆడిన ట్రాక్ రికార్డు దానిది

ఇదే కాదు మా భూమి, భైరవ ద్వీపం, ఆదిత్య 369, జగదేకవీరుడు అతిలోకసుందరి, శివ, బాహుబలి లాంటి పాత్ బ్రేకింగ్ సినిమాలు ఎప్పుడో తీశాం. ఇప్పుడు కొత్తగా ప్రూవ్ చేయాల్సింది ఏమీ లేదు. రాజమౌళి గురించి స్టీవెన్ స్పిల్బర్గ్, జేమ్స్ క్యామరూన్ మాట్లాడింది మర్చిపోతే ఎలా. ఏదో ఇప్పుడు 2018 హిట్టయ్యిందని  మనమెప్పుడూ తీయలేదని అనుకోవడం ఎందుకు. ఆ మాటకొస్తే ఇలాంటి బ్యాక్ డ్రాప్ తోనే గత ఏడాది గమనం వచ్చింది. జనానికి రీచ్ కాలేదు. స్టాండర్డ్ గురించి కొత్తగా టాలీవుడ్ కు ఎవరు నేర్పించాల్సింది ఏమి లేదు. హరీష్ శంకర్ కౌంటర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది