ఒకేసారి ఇండియన్ 2, గేమ్ చేంజర్ లను డీల్ చేస్తున్న దర్శకుడు శంకర్ పుణ్యమాని రామ్ చరణ్ కు మంచి ఫ్రీ స్పేస్ దొరుకుతోంది. నిన్న జి20 సదస్సుకు ఫిలిం టూరిజం తరఫున అతిథిగా వెళ్లడం సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయ్యింది. విదేశీ ప్రతినిధులతో మంతనాలు, స్టేజి మీద నాటు నాటు స్టెప్పులు, కేంద్ర మంత్రి ఇచ్చిన ఎలివేషన్లు వగైరా మాములు వైరల్ అవ్వలేదు. మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ షేర్ చేసుకుని ఆనందాన్ని పంచుకుంటున్నారు. గ్లోబల్ స్టార్ అంటూ పలువురు ప్రస్తావించడాన్ని హైలైట్ చేస్తూ వీలైనంత ట్రెండింగ్ జరిగేలా చూసుకుంటున్నారు.
ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన ఫేమ్ ని ఫుల్ గా క్యాష్ చేసుకుంటున్నది చరణే. ఒకపక్కా జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ కి అత్యవసరమైతే తప్ప బ్రేక్ ఇవ్వలేని పరిస్థితి. దీంతో పాటు పుట్టినరోజు కారణంగా మొన్న తాతయ్య శతజయంతి ఉత్సవాలకు వెళ్లలేకపోవడం గురించి ఎన్ని కథనాలు వస్తున్నాయో చూడలేక లేదు. అయినా తప్పని పరిస్థితి. ఇలాంటి ఇబ్బంది చరణ్ కు లేదు. ఎందుకంటే అసలు గేమ్ చేంజర్ ఎప్పుడు రిలీజో ఇంకా ఎవరికీ తెలియదు. 2024 సంక్రాంతినా లేక వేసవినానేది నిర్మాత దిల్ రాజు సైతం చెప్పలేకపోతున్నారు
అలాంటపుడు ఒత్తిడి ఉండదు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో చేయాల్సిన సినిమా కోసం చరణ్ పూర్తిగా మేకోవర్ కావాల్సి ఉంటుంది. గేమ్ చేంజర్ పూర్తయితే తప్ప అది జరగదు. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. అందుకే ఆహ్వానాలు ఏవి వచ్చినా ఎంత దూరం వెళ్లాల్సి వచ్చినా చరణ్ హ్యాపీగా ఎస్ చెప్పేస్తున్నాడు. ఇది ఏ కోణంలో చూసినా తన ఇమేజ్ ని పెంచేదే. జి20కి దిల్ రాజు కూడా వెళ్లారు. కిషన్ రెడ్డితో కలిసి సందడిగా తిరిగారు. డ్రైగా ఉన్న టైంలో చరణ్ కు ఇవన్నీ కలిసి వచ్చే అంశాలే. స్పీచుల్లో మెచ్యూరిటీ బాగా పెరుగుతున్న మాట వాస్తవం