పెళ్లి పై మళ్లీ రూమర్లు.. కీర్తి సురేష్ క్లారిటీ

కీర్తి సురేష్ తెర మీద ఎక్కువగా ట్రెడిషనల్ క్యారెక్టర్లు చేస్తుంటుంది. బయట కూడా ట్రెడిషనల్ అమ్మాయిలాగే ఉంటుంది. ఆమె గురించి బాలీవుడ్ హీరోయిన్ల లాగా ఎఫైర్ వార్తలు పెద్దగా రావు. ఎవరితోనూ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్నట్లు బలమైన వార్తలు ఎప్పుడూ రాలేదు. కానీ తన పెళ్లి గురించి మాత్రం ఎప్పటికప్పుడు వార్తలు పుడుతూనే ఉన్నాయి. కెరీర్ ఆరంభంలో తమిళ కమెడియన్ సతీష్‌ను ఆమె పెళ్లాడుతుందని ప్రచారం జరిగితే.. ఆ తర్వాతేమో సంగీత దర్శకుడు అనిరుధ్‌‌తో తన వివాహం అంటూ ఊహాగానాలు వినిపించాయి. ఈ వార్తలను ఆమె తేలిగ్గా తీసుకుని కొట్టిపడేసింది.

ఐతే కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ కీర్తి పెళ్లి గురించి మళ్లీ రూమర్లు మొదలయ్యయాయి. కీర్తి జీవితంలో ఒక మిస్టరీ మ్యాన్ ఉన్నాడని.. అతను ఒక వ్యాపారవేత్త అని.. కుటుంబ సభ్యుల అంగీకారంతో తనని కీర్తి త్వరలో పెళ్లాడబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ మిస్టరీ మ్యాన్‌తో కీర్తి కలిసి ఉన్న ఫొటో కూడా సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఐతే ఆ వ్యక్తి తన స్నేహితుడే అంటూ తన పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చింది కీర్తి.

‘‘హహహ.. ఈసారి నా బెస్ట్ ఫ్రెండ్‌ను నా పెళ్లి వార్తల్లోకి లాగారా? నిజమైన మిస్టరీ మ్యాన్‌ను సరైన సమయంలో పరిచయం చేస్తాను. అంత వరకు చిల్‌గా ఉండండి. నా పెళ్లి గురించి ఒక్కసారి కూడా సరైన వార్తలు రాలేదు’’ అని కీర్తి పేర్కొంది. ‘మహానటి’తో పలు భాషల ప్రేక్షకులను కట్టి పడేసి.. తన అభిమానులుగా మార్చుకున్న కీర్తికి తర్వాత సరైన సక్సెస్‌లు రాలేదు. ఇటీవల ఆమె ‘దసరా’తో చాన్నాళ్ల తర్వాత మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆమె చిరంజీవితో కలిసి ‘భోళా శంకర్’తో పాటు.. ‘రివాల్వర్ రీటా’ అనే ద్విభాషా చిత్రంలో నటిస్తోంది.