సలార్ యాక్షన్ మోతకు పూనకాలే..

యశ్ అనే కన్నడ హీరో గురించి తెలుగు వాళ్లకు కొన్నేళ్ల ముందు వరకు అసలు పరిచయమే లేదు. అతను తెలుగులో ఏ సినిమా చేయలేదు. తెలుగు అతడి అనువాద చిత్రాలు కూడా రిలీజ్ కాలేదు. ఇలా మనకు పరిచయం లేని హీరోను మాస్ ఎలివేషన్లతో ప్రెజెంట్ చేస్తూ ఒక సినిమా తీసి తెలుగులో రిలీజ్ చేస్తే.. ఆ ఎలివేషన్లను మనం ఫీల్ కావడం, గూస్ బంప్స్ తెచ్చుకోవడం అంటే కష్టమే.

కానీ ‘కేజీఎఫ్’ అనే సినిమా మాత్రం మన ఆడియన్స్‌ను ఒక ఊపు ఊపేసింది. రాకీ భాయ్ అనే క్యారెక్టర్ మన జనాలకు మామూలుగా ఎక్కలేదు. థియేటర్లలో మన స్టార్ హీరోను చూస్తున్నట్లుగా ఊగిపోయారు జనాలు. ఇక కేజీఎఫ్-2 రేపిన సంచలనం గురించి చెప్పేదేముంది? కన్నడలో కూడా మరీ పెద్ద స్టార్ ఏమీ కాని యశ్‌ను అక్కడి జనాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులకు ఇంతగా కనెెక్ట్ చేయడం ప్రశాంత్‌ నీల్‌కే చెల్లింది.

మనకు పరిచయం లేని యశ్‌తోనే గూస్ బంప్స్ వచ్చేలా చేశాడు అంటే.. ‘బాహుబలి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన, అదిరిపోయే మాస్ కటౌట్ ఉన్న ప్రభాస్ లాంటి స్టార్‌తో సినిమా చేస్తే ఎలివేషన్లు, మాస్-యాక్షన్ సీన్లు ఏ రేంజిలో ఉంటాయో ఊహించుకుంటేనే ప్రేక్షకులకు పూనకాలు వచ్చేస్తున్నాయి. వీరి కలయికలో రాబోతున్న ‘సలార్’కు సంబంధించి చిన్న పోస్టర్ రిలీజ్ చేసినా ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. ఇక ఈ సినిమా యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘సలార్’లో ఎలివేషన్లు, యాక్షన్ ఘట్టాలు పీక్స్‌ అంటే పీక్స్‌లో ఉంటాయట.

యాక్షన్ ఘట్టాలకు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమట. ఇంట్రో సీన్.. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్.. ఇలా ప్రతి ఘట్టం దేనికదే స్పెషల్ అని.. ఇండియన్ స్క్రీన్ మీద అరుదు అనిపించేలా ఎలివేషన్ సీన్లు, యాక్షన్ ఘట్టాలు ఉంటాయని అంటున్నారు. క్లైమాక్సులో అయితే 400 మంది రౌడీలతో ఒకేసారి ప్రభాస్ తలపడేలా భారీ యాక్షన్ ఘట్టం తీర్చిదిద్దారని.. ఆ ఎపిసోడ్‌తో థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి.. సెప్టెంబరు 28న ‘సలార్’ ఇచ్చే కిక్ ఎలా ఉంటుందో?