సంగీత దర్శకులు రాజ్ మైలురాళ్లు

టాలీవుడ్ సంగీతాన్ని మేలి మలుపు తిప్పిన వాళ్లలో జంట మ్యూజిక్ డైరెక్టర్లు రాజ్ కోటి ప్రస్థానం చాలా ప్రత్యేకం. ఇవాళ హఠాత్తుగా అనారోగ్యంతో రాజ్ మృతి చెందడాన్ని మ్యూజిక్ లవర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. 80 దశకం మధ్యలో నుంచి 1995 ప్రాంతం వరకు విడిపోయే దాకా ఈ ఇద్దరూ ఇచ్చిన ఆల్బమ్స్ మాములు బ్లాక్ బస్టర్స్ కాదు. యముడికి మొగుడు, హలో బ్రదర్, ఖైదీ నెంబర్ 786, బావ బావమరిది, బాల గోపాలుడు, ముఠామేస్త్రి, గోవిందా గోవిందా లాంటి ఎన్నో చిత్రాలకు ఎవర్ గ్రీన్ క్లాసిక్ ట్యూన్స్ ఇచ్చారు. కోటితో దోస్తీ వద్దనుకున్నాక రాజ్ కెరీర్ నెమ్మదించింది.

రాజ్ మొన్నటి తరం సంగీత దర్శకులు టీవీ రాజు గారి అబ్బాయి. తాతల స్వస్థలం రాజమండ్రి పక్కన రఘుదేవపురం. ఈయన బాల్యం చెన్నైలో గడిచింది. చిన్న వయసులో తండ్రి ప్రోత్సాహంతో సంగీతం నేర్చుకున్నారు. హీరో భానుచందర్ తో కలిసి ధనరాజ్ దగ్గర శిష్యరికం చేశారు. 1983లో ప్రళయ గర్జనతో కోటితో కలిసి రాజ్ సినీ ప్రయాణం మొదలైంది. ఈ ఇద్దరికీ చక్రవర్తి గారి దగ్గర పని నేర్చుకున్న అనుభవం ఎంతో ఉపయోగపడింది. సంసారం, నా పిలుపే ప్రభంజనంతో స్టార్ల దృష్టిలో పడ్డారు. 1989 నుంచి 1995 వరకు కేవలం ఆరు సంవత్సరాలలో 150కి పైగా సినిమాలకు పని చేయడం ఒక రికార్డు.

సోలో సంగీత దర్శకుడిగా రాజ్ అన్ని భాషలకు కలిపి 60 సినిమాల దాకా కంపోజ్ చేశారు. వాటిలో నాగార్జున రాముడొచ్చాడు, సిసింద్రీ మంచి పేరు తీసుకొచ్చాయి. వెంకటేష్ ప్రేమంటే ఇదేరాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మైసమ్మ ఐపీఎస్, టక్కరి దొంగ లాంటి సినిమాల్లో పలు పాత్రలు పోషించారు. సహచరుడు కోటి అంత దూకుడు చూపించనప్పటికీ ఈ ఇద్దరి కలయికలో వచ్చిన పాటల్లో రాజ్ కంట్రిబ్యూషన్ చాలా ఉందని పలు సందర్భాల్లో ఆయనే చెప్పారు ఇటీవలే జరిగిన బేబీ రెండో ఆడియో సాంగ్ లాంచ్ లో గెస్ట్ గా రావడమే రాజ్ గారికి చివరి మీడియా పలకరింపు.