డర్టీ హరి.. వేరే దర్శకుడిని చేయమంటే?

ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు సీనియర్ నిర్మాత ఎం.ఎస్.రాజు. మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాలతో ఆయన పేరే ఒక బ్రాండుగా మారింది టాలీవుడ్లో. ఇప్పుడు టాలీవుడ్ నంబర్ వన్ ప్రొడ్యూసర్ స్థాయిలో ఉన్న దిల్ రాజుకు కూడా ఎం.ఎస్.రాజే స్ఫూర్తి.

ఐతే నిర్మాతగా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలే తీసిన రాజు.. దర్శకుడిగా ‘డర్టీ హరి’ లాంటి బోల్డ్ సినిమా తీయడం ఆశ్చర్యకరం. అందులో కొన్ని సీన్లు చూసి.. ఈ చిత్రాన్ని 60 ఏళ్లు పైబడ్డ వ్యక్తి తీశాడు అంటే చాలామంది షాకవుతారేమో. నిజానికి ఈ సినిమాను తనే తీయాలని రాజు అనుకోలేదట. కథ రాసింది తనే అయినా వేరే యంగ్ డైరెక్టర్‌తో తీయిస్తే యూత్‌ఫుల్‌గా ఉంటుందని అనుకున్నాడట. అందుకోసం ఒక యువ దర్శకుడిని సంప్రదిస్తే.. ఇంత బోల్డ్ సినిమా తాను తీయలేను అని చేతులెత్తేశాడట. ఆ స్థితిలో తనే ఆ సినిమా తీసినట్లు రాజు వెల్లడించాడు.

దర్శకులే కాక యువ నటులు కూడా బోల్డ్ సినిమాలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారని.. కానీ తాను మాత్రం యువకులను కూడా భయపెట్టే సబ్జెక్టులు చేయాలని అనుకుంటున్నానని.. ట్రెడిష‌న్‌ను బ్రేక్ చేసే సినిమాలతో సంచలనం సృష్టించాలన్నది తన ఉద్దేశమని రాజు అన్నారు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సినిమాలు చేయాలని.. అలా మారలేకపోతే రిటైరై ఇంట్లో మనవళ్లతో ఆడుకోవడం మంచిదని రాజు తేల్చేశారు.

ఇక సీనియర్ నటుడు నరేష్‌తో తాను చేసిన ‘మళ్ళీ పెళ్ళి’ గురించి మాట్లాడుతూ.. ఇది రియల్ స్టోరీనా, కల్పిత కథనా అని చెప్పలేమన్నారు. సినిమా చూస్తే అందరికీ ఒక క్లారిటీ వస్తుందని చెప్పారు. ఈ కథ రాశాక తాను నరేష్‌ను సంప్రదించానని.. ఆయనైతే ఈ సినిమాకు న్యాయం చేయగలరని భావించానని.. ఆయన పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని.. ఎంత డెప్త్‌గా సినిమా తీస్తారో తీయండి అని చెప్పి తాను కోరుకున్నవి అన్నీ ఇచ్చారని రాజు వెల్లడించారు. ‘మళ్ళీ పెళ్లి’ ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.