ఖాళీ మైదానంలో సిక్సర్ కొట్టే ఛాన్స్

రేపు విడుదల కాబోతున్న అన్నీ మంచి శకునములేకి పూర్తిగా ఫ్రీ గ్రౌండ్ దొరికింది. ఎలాంటి పోటీ లేదు. ఎల్లుండి బిచ్చగాడు 2 ఉన్నప్పటికీ దాని మీదా మరీ భీభత్సమైన హైప్ ఏమి లేదు. వరస ఫ్లాపులతో సతమవుతున్న సంతోష్ శోభన్ కి శకునములే సక్సెస్ చాలా కీలకం. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అతనే చెప్పినట్టు ఇంత మంచి సెటప్, బ్యానర్, ప్రమోషన్లు చేసే టీమ్ మళ్ళీ అంత సులభంగా దొరక్కపోవచ్చు. బడ్జెట్ తక్కువే అయినా స్వప్న సినిమా పబ్లిసిటీలో రాజీ పడలేదు. గత నెల రోజులుగా ఏదో ఒక రూపంలో దీని గురించి ప్రచారం వచ్చేలా పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్లారు

అయితే ఇదంతా అడ్వాన్స్ బుకింగ్స్ కి ఏమంత ఉపయోగపడలేదు. తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లో ఎండ తీవ్రత 42 డిగ్రీలకు పైగా ఉండటంతో అర్జెంట్ గా సినిమాలు చూసే మూడ్ లో జనాలు లేరు. అందులోనూ స్టార్ క్యాస్టింగ్ లేని మూవీ అంటే సహజంగానే ఆసక్తి తక్కువగా ఉంటుంది. దర్శకురాలు నందిని రెడ్డికి ఓ బేబీ రూపంలో హిట్ ఉండటం వల్ల ఆ ఫ్యాక్టర్ కుటుంబ ప్రేక్షకులను దీని మీద ఓ లుక్ వేసేలా చేసింది. అయితే వాళ్ళు థియేటర్ల దాకా రావాలంటే అదిరిపోయిందనే మాట పబ్లిక్ నుంచి వినిపించాలి. అప్పుడు సాయంత్రం నుంచి పికప్ ఆశించవచ్చు.

కంటెంట్ మీద నమ్మకంతోనే సాంప్రదాయ శుక్రవారం రిలీజ్ కు బదులు గురువారమే వస్తున్న అన్నీ మంచి శకునములేకు నగరాల్లో ఏదైనా స్పీడ్ బ్రేకర్ ఉందంటే అది హాలీవుడ్ మూవీ ఫాస్ట్ ఎక్స్ మాత్రమే. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని బాగా ఆకర్షిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కి ఆన్ లైన్ సేల్స్ బాగున్నాయి. ఒకవేళ మునుపటి భాగాల్లాగా సూపర్ హిట్ అనిపించుకుంటే కొంత మేర ప్రభావం ఉంటుంది. దసరా, విరూపాక్ష తప్ప ఇంకేవి వేసవిలో మెప్పించలేకపోయిన తరుణంలో క్లీన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న శకునములే ఖాళీ మైదానంలో సిక్సర్ కొడుతుందో లేదో రేపు తేలిపోతుంది