మల్టీప్లెక్సులు ఇప్పుడైనా కళ్ళు తెరుస్తాయా

తాము పెట్టిందే రేటు అమ్మిందే ఫుడ్డు రీతిలో ఇష్టారాజ్యంగా ప్రేక్షకులను నిలువుదోపిడికి గురి చేస్తున్న మల్టీప్లెక్స్ సంస్కృతికి క్రమంగా షాకులు తగులుతున్నాయి. పివిఆర్ ఐనాక్స్ సంయుక్తంగా విడుదల చేసిన 2023 తొలి క్వార్ట్రర్ ఆర్థిక ఫలితాల్లో 334 కోట్ల నికర నష్టాన్ని చూపించడం ఇండస్ట్రీని విస్మయపరిచింది. ఇది కేవలం జనవరి నుంచి మార్చి దాకా లెక్కగట్టిన మొత్తమే.

ఆశించిన స్థాయిలో బాలీవుడ్ హాలీవుడ్ చిత్రాలు పెర్ఫార్మ్ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. నష్టనివారణ చర్యల్లో భాగంగా త్వరలో 50 స్క్రీన్లను మూసేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2, పఠాన్ లాంటి సినిమాలకు వచ్చిన ఫుట్ ఫాల్స్ ని చూసి అన్నింటికి ఇదే ధరలు ఇదే స్పందన వస్తుందన్న తప్పుడు అంచనాతో ధరల విషయంలో సానుకూలంగా చర్యలు తీసుకోకపోవడం ఓవరాల్ బిజినెస్ ని తీవ్రంగా దెబ్బ తీస్తోంది.

ఉత్తరాది రాష్ట్రాల్లో నాలుగైదు వందలు పెట్టి కంటెంట్ లేని చిత్రాల కోసం థియేటర్లకు వచ్చేందుకు ఆడియన్స్ సుముఖత చూపడం లేదు. దీని వల్ల రెవిన్యూ దారుణంగా పడిపోతూ వీక్ డేస్ లో రద్దవుతున్న షోల సంఖ్య అంతకంతా పెరుగుతూ పోతోంది. సింగల్ స్క్రీన్ల స్థితి కొంత మెరుగ్గా ఉండటం ఊరట

ఇకనైనా టికెట్ రేట్లు, స్నాక్స్ మీద దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉంది. లేదూ ఇలాగే ఉంటామంటే ఇప్పటికే ఓటిటికి విపరీతంగా అలవాటైన జనం స్టార్ హీరోలకు తప్ప చిన్నా చితక హీరోలకు రామనే ప్రమాదం లేకపోలేదు. థియేటర్ ఎంటర్ టైన్మెంట్ అనేది ఎప్పుడూ అందుబాటులో ధరలో ఉంటేనే పరిశ్రమ పచ్చగా ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే ఖరీదైన వ్యవహారంగా మార్చారో ఇదిగో ఇలాగే నష్టాలు స్వాగతం చెబుతాయి. అన్నట్టు బాగా నడుస్తున్న చోట్ల మరో 150 దాకా స్క్రీన్లను జోడించబోతోంది పివిఆర్. అవి కూడా అధిక శాతం నగరాల్లో ఉన్నవే.