జూనియర్ ఎన్టీఆర్. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా చిత్ర సీమలో తన సత్తాను చాటుతున్న జూనియర్‌కు దేశ విదేశాల్లోనూ అనేక మంది అభిమానులు ఉన్నారు. అయితే.. కుటుంబ పరంగా చూసుకుంటే.. ఆయనను నందమూరి కుటుంబం దూరం పెట్టిందనే వాదన ఉంది. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేసిన తర్వాత.. ఆయనను పార్టీకి.. అదేవిధంగా నందమూరి కుటుంబానికి కూడా దూరంగా ఉంచారనే చర్చ ఇప్పటికీ జరుగుతూనే ఉంది.
అంతేకాదు.. ప్రస్తుతం దివంగత మహానటుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ప్రారంభమైనా.. దేశ విదేశాల్లో జరుగుతున్నా.. ఆయన మనవడిగా వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న జూనియర్‌ను పక్కన పెట్టారని.. ఆయనకు కనీసం ఆహ్వానం కూడా అందడం లేదని.. జూనియర్ అభిమానులు అనేక సందర్భాల్లో వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికితోడు బాలకృష్ణ కూడా ఎక్కడా జూనియర్ పేరును ప్రస్తావించడం లేదు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన శతజయంతి అంకురార్పణ కార్యక్రమానికి కూడా జూనియర్‌ను ఆహ్వానించలేదు.
దీంతో జూనియర్ అభిమానులు విమర్శలకు పదును పెంచారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ, అలాగే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కమిటి చైర్మన్ టిడి జనార్దన్ సోమవారం జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి మే 20 వ తేదీన హైదరాబాద్ లో జరిగే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవానికి రావాలని ఆహ్వానించడం చర్చకు దారితీసింది. దీనితో ఎన్టీఆర్ ని దూరం పెట్టారు, పక్కన పెట్టారు అనే విమర్శలకు చెక్ పెట్టినట్టు అయిందని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున కూడా జూనియర్ సేవలను వినియోగించుకునే అవకాశం ఉందనే చర్చ ఇప్పుడు తాజాగా తెరమీదికి వచ్చింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates