ఏప్రిల్ 28.. ఈ డేట్ ఒకప్పుడు పోకిరి, బాహుబలి-2 లాంటి బ్లాక్‌బస్టర్లకు ఫేమస్. కానీ ఇప్పుడు ఈ డేట్ గుర్తు తెచ్చుకుంటే ఆచార్య, ఏజెంట్ లాంటి డిజాస్టర్లే కళ్ల ముందు మెదులుతున్నాయి. గత ఏడాది ఆచార్య, ఈ ఏడాది ఏజెంట్ అదే డేట్‌కు వచ్చి ఎంత పెద్ద డిజాస్టర్లు అయ్యాయో తెలిసిందే. ఈ రెండు సినిమాల విషయంలో రిలీజ్ ముందు వరకు అంతా బాగానే కనిపించింది. కానీ రిలీజ్ తర్వాత టీంలో మిగతా వాళ్లంతా కలిసి దర్శకుడి మీద నింద నెట్టేశారు.
ఒక సినిమా ఫలితానికి ప్రధానంగా బాధ్యత వహించాల్సింది దర్శకుడే అనడంలో సందేహం లేదు. కానీ ఒక కథను ఓకే చేసినపుడు.. సినిమా చేస్తున్నపుడు టీం అంతా ఏకాభిప్రాయానికి వస్తేనే సినిమాను ముందుకు కదులుతుంది. ఏమైనా తేడాలుంటే స్క్రిప్టు దశలో లేదా మేకింగ్ టైంలో లేదంటే చివరగా ఎడిటింగ్ టేబుల్ దగ్గర మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశముంటుంది.
కానీ ఆ దశలన్నీ దాటుకుని రిలీజ్ ముందు సినిమా గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడి, దర్శకుడిని కొనియాడి.. తీరా ఫలితం తేడా కొట్టగానే దర్శకుడి మీద నింద మోపడం.. తన కెరీర్‌ను దెబ్బ తీసేలా వ్యవహరించడం ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్న తలెత్తుతోంది ఇప్పుడు. గత ఏడాది ఆచార్య విషయంలో కొరటాల శివ.. ఏజెంట్ విషయంలో సురేందర్ రెడ్డి అలాంటి నిందే ఎదుర్కొంటున్నారు. చిరు పలుమార్లు పరోక్షంగా కొరటాలను విమర్శించడంపై ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. సంగీత దర్శకుడు మణిశర్మ సైతం కొరటాలనే నిందించాడు.
ఇప్పుడు ఏజెంట్ సినిమా విషయంలో ఆల్రెడీ నిర్మాత అనిల్ సుంకర.. సురేందర్‌ను పరోక్షంగా తప్పుబట్టాడు. అఖిల్‌ను పొగిడాడు. తాజాగా అఖిల్ అభిమానులకు సారీ చెబుతూ నిర్మాతను కొనియాడాడు. కానీ దర్శకుడు సురేందర్ పేరే ఎత్తలేదు. ఇద్దరూ కూడా సురేందర్ విషయంలో తమ అసంతృప్తిని బయటపెట్టారు. సినిమా ఫలితానికి అతణ్నే బాధ్యుడిని చేశారు. ఐతే సినిమాను ఓకే చేసి ముందుకు తీసుకెళ్ల్లింది వీళ్లే అయినపుడు ఫెయిల్యూర్లో బాధ్యత వీళ్లకీ ఉంటుంది కదా? అలాంటపుడు కేవలం దర్శకుడినే నిందించడం కరెక్టా అన్నది ప్రశ్న.