సలార్ గురించి రూమర్లు నిజం కాదు

ప్రభాస్ ఇప్పుడు మామూలు దూకుడు మీద లేడు. అతను నటించిన మూడు భారీ చిత్రాలు అటు ఇటుగా ఏడు నెలల వ్యవధిలో రాబోతున్నాయంటేనే తనెంత వేగంగా సినిమాలు చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఆదిపురుష్ విడుదలకు సరిగ్గా ఇంకో నెల రోజుల సమయమే ఉంది. ఆ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న సంగతి తెలిసిందే.

ఐతే దీని తర్వాత సెప్టెంబరు 28కి షెడ్యూల్ అయిన ‘సలార్’ విషయంలో రెండు రోజులుగా జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ చిత్రం అనుకున్న ప్రకారం విడుదల కాకపోవచ్చని.. వచ్చే సంక్రాంతికి వాయిదా పడుతోందని.. దీంతో ఆ పండక్కి షెడ్యూల్ అయిన ‘ప్రాజెక్ట్-కే’ వెనక్కి వెళ్లబోతోందని రూమర్లు ఊపందుకున్నాయి. కానీ ‘సలార్’ టీం ఈ ప్రచారాన్ని ఖండించింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందూర్ ఈ మేరకు స్పష్టతను ఇచ్చాడు.

సలార్‌ను ముందు నుంచి అనుకుంటున్న ప్రకారమే సెప్టెంబరు 28న విడుదల చేయబోతున్నట్లు విజయ్ స్పష్టం చేశాడు. ఈ అప్‌డేట్ ప్రభాస్ అభిమానులను ఎగ్జైట్ చేస్తోంది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ సినిమాల్లో అత్యధిక అంచనాలున్న సినిమా ఇదే. సాహో, ఆదిపురుష్, ప్రాజెక్ట్-కే దాంతో పోలిస్తే భారీ బడ్జెట్లో తెరకెక్కిన, పెద్ద కాన్వాస్ ఉన్న సినిమాలే కానీ.. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రభాస్ లాంటి మాచో స్టార్‌తో తీసిన సినిమా కావడంతో ‘సలార్’ మాస్‌ను ఊపేసి.. బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం అనే అంచనాలున్నాయి.

ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేయగలదని భావిస్తున్నారు. ప్రభాస్ అసలైన స్టామినా ఏంటో ఈ సినిమా చూపిస్తుందని అభిమానులు ధీమాగా చెబుతున్నారు. అందుకే ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంకో నాలుగు నెలల్లోనే ఈ సినిమా రిలీజ్ కానుందన్న సమాచారం ప్రభాస్ అభిమానులను నిలవనీయట్లేదు.