మలయాళ హీరోయిన్లు చాలామంది తెలుగులో మంచి స్థాయికి వెళ్లారు కానీ.. ఒక మలయాళ హీరోను తెలుగు ప్రేక్షకులు తమ వాడిలా ఫీలయ్యి అక్కున చేర్చుకోవడం అరుదైన విషయమే. ఈ అవకాశం దుల్కర్ సల్మాన్ మాత్రమే అందుకున్నాడు. డబ్బింగ్ మూవీ ‘ఓకే బంగారం’తో తొలిసారి తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడ్డ అతను.. ఆ తర్వాత ‘మహానటి’లో జెమిని గణేషన్ పాత్రతో కట్టి పడేశాడు.
ఇక ‘సీతారామం’ సినిమాతో అతను వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. ఈ సినిమా చూసి దుల్కర్‌ను ఇష్టపడని వాళ్లంటూ ఎవరూ ఉండరు అంటే అతిశయోక్తి కాదు. పరభాషా కథానాయకుడు అనే ఫీలింగ్ రవ్వంత కూడా రానివ్వకుండా ప్రేక్షకులను కట్టిపడేశాడు దుల్కర్. ఆ సినిమా తర్వాత అతడికి తెలుగులో చాలా అవకాశాలే వచ్చాయని సమాచారం. కానీ తనకొచ్చిన పేరు, ఫాలోయింగ్‌ను దెబ్బ తీసుకోకుండా మంచి సినిమా చేయాలని ఆగాడు.
చివరికి ఇప్పుడు వెంకీ అట్లూరితో అతను జట్టు కడుతున్నాడు. వెంకీతో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్సే ఈ చిత్రాన్ని కూడా నిర్మించనుంది. ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దె’ చిత్రాలతో నిరాశపరిచిన వెంకీ.. ‘సార్’ మూవీతో ఆకట్టుకున్నాడు. ధనుష్ లాంటి స్టార్ హీరోను ఇతను డీల్ చేయగలడా అని చాలామంది సందేహించారు కానీ.. అతడికి మంచి హిట్ ఇచ్చి తనేంటో చాటి చెప్పాడు వెంకీ. ఈసారి అతను మలయాళ హీరో అయిన దుల్కర్‌ను తన కథతో మెప్పించాడు.
ఇది వెంకీ తొలి మూడు చిత్రాల మాదిరి పక్కా ప్రేమ కథ అని సమాచారం. దుల్కర్ ప్రేమకథలను ఎంత బాగా పండిస్తాడో చెప్పాల్సిన పని లేదు. వీరి కలయికలో సినిమా అనగానే ప్రేక్షకులు కూడా ‘సీతారామం’ లాంటి హృద్యమైన ప్రేమకథనే ఆశిస్తారు. మరి ‘సీతారామం’ లాంటి మ్యాజిక్‌ను వీళ్లిద్దరూ రీక్రియేట్ చేయగలరా అన్నది చూడాలి. దుల్కర్ కోసం ఒక అందమైన, చక్కటి అభినయం ప్రదర్శించగల హీరోయిన్ కోసం వెతుకుతోంది చిత్ర బృందం.
Gulte Telugu Telugu Political and Movie News Updates