హరీష్ శంకర్ మొత్తం మార్చేశాడు

రీమేక్ సినిమాలంటే చాలా వరకు ఒరిజినల్‌నే ఫాలో అయిపోతుంటారు దర్శకులు. ఒక భాషలో సినిమా హిట్టయిందంటే.. రీమేక్ చేసేటపుడు అందులో ప్రతి అంశం అలాగే ఉండాలని అనుకుంటారు. కానీ హరీష్ శంకర్ మాత్రం ఇందుకు భిన్నం. మాతృకలోని మూల కథను తీసుకుని తనదైన శైలిలో కథనం జోడిస్తుంటాడు.

సన్నివేశాలు చాలా వరకు మార్చేస్తుంటాడు. ‘దబంగ్’ సినిమా ఆధారంగా తీసిన ‘గబ్బర్ సింగ్’లో తన టాలెంట్ ఏంటో అందరూ చూశారు. మాతృక చూసి.. దీన్ని చూస్తే చాలా మార్పు కనిపిస్తుంది. సినిమా ఫ్లేవరే మార్చేశాడు హరీష్. దీని తర్వాత ‘జిగర్ తండ’కు ఇచ్చిన తెలుగు టచ్ కూడా ప్రత్యేకమైంది. పూర్తిగా నరేటివ్‌నే మార్చేస్తూ ‘గద్దలకొండ గణేష్’కు ఒక కొత్త లుక్‌లో చూపించాడు హరీష్. దీంతో రీమేక్ తీయాలంటే హరీషే తీయాలి అనే అభిప్రాయం టాలీవుడ్లో బలపడింది.

ఇప్పుడు హరీష్ శంకర్ చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేకా కాదా అనే విషయంలో చాలా సందిగ్ధత నడిచింది. ఇది వాస్తవానికి ‘తెరి’ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమానే. కాకపోతే అందులో మూల కథ.. హీరో పాత్రను మాత్రమే తీసుకుని దానికి హరీష్ తనదైన టచ్ ఇస్తున్నాడు. ‘తెరి’ చూసినవాళ్లు.. తాజాగా రిలీజైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీజర్ చూస్తే హీరో పోలీస్ అనే విషయంలో తప్ప ఏ పోలికా కనిపించదు. పవన్ పాత్ర చిత్రణ అంతా మారిపోయినట్లే కనిపిస్తోంది.

చిత్ర వర్గాల సమాచారం ప్రకారం.. ‘తెరి’తో పోలిస్తే కథను 80-90 శాతం మార్చేశారట. ఇందులో ఫ్లాష్ బ్యాక్ పూర్తి భిన్నంగా ఉంటుందట. వర్తమానంలో కూడా కీలక ఎపిసోడ్లను మార్చేశారట. చివరగా చూస్తే ఇది ‘తెరి’కి రీమేక్ అంటే ఒరిజినల్ మేకర్స్ కూడా ఒప్పుకోని విధంగా ఉంటుందట. పవన్ మళ్లీ ఓ రీమేక్ సినిమ ాచేస్తున్నాడని ఎవ్వరూ ఫీలవ్వాల్సిన అవసరం లేదని.. ‘గబ్బర్ సింగ్’ తరహాలో ఇది ఎంటర్టైన్ చేయడం గ్యారెంటీ అని అంటున్నారు.