రాజ‌మౌళి ఇలా హింట్ ఇచ్చాడో లేదో..

రాజ‌మౌళి రామాయణం గురించి ఎప్పుడు మాట్లాడినా సోష‌ల్ మీడియా హోరెత్తిపోవ‌డం మామూలే. ప‌దేళ్ల కింద‌టే ఇది త‌న డ్రీమ్ ప్రాజెక్ట‌ని.. ఎప్ప‌టికైనా భారీ ఎత్తున ఈ సినిమా తీస్తాన‌ని జ‌క్క‌న్న ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న కోరుకున్న ప‌దేళ్ల అనుభ‌వం కూడా ఇప్ప‌టికే వ‌చ్చేసింది. ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ.. మ‌హాభార‌తం సినిమా తీస్తే ప‌ది భాగాలుగా ఉంటుంద‌ని జ‌క్క‌న్న చెప్ప‌డం అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. దీని మీద చ‌ర్చోప చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి.

ఇక సోష‌ల్ మీడియాలో దీని మీద ఊహాగానాలు.. మీమ్స్ కూడా రెడీ అయిపోయాయి. అందులో కొన్ని సోష‌ల్ మీడియాను ఊపేస్తున్నాయి. రాజ‌మౌళి మ‌హాభార‌తం గురించి ప్ర‌స్తావించిన నేప‌థ్యంలో అందులో ప్ర‌ధాన పాత్ర‌లు ఎవ‌రు చేస్తే బాగుంటంద‌నే ఆలోచనతో తయారు చేసిన ఒక వీడియో ఆసక్తి రేకెత్తిస్తోంది. దుర్యోధనుడిగా రానా, కర్ణుడిగా ప్రభాస్, ధర్మరాజుగా పవన్ కళ్యాణ్, భీముడిగా ఎన్టీాఆర్, నకులుడిగా అడివి శేష్, సహదేవుడిగా నిఖిల్, పరశురాముడిగా బాలకృష్ణ, అభిమన్యుడిగా అఖిల్, ఏకలవ్యుడిగా సందీప్ కిషన్, అశ్వథ్థాముడిగా అల్లు అర్జున్, అర్జునుడిగా రామ్ చరణ్, శ్రీకృష్ణుడిగా మహేష్ ముఖ్య పాత్రలు పోషిస్తే బాగుంటుందంటూ ఈ వీడియోలో గెటప్స్ వేసి మరీ చూపించారు. ఇదిలా ఉండగా.. ఈ మధ్య చిన్న పిల్లల్ని ఒక వ్యక్తి లిఫ్ట్ ఇవ్వడం కోసం కారులో ఎక్కించుకుని.. మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లిపోతారా అని అంటే.. వద్దు వద్దు అంటూ పిల్లలు గట్టిగా అరిచే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీన్ని అనేక సందర్భాలకు కామెడీగా వాడేస్తున్నారు. రాజమౌళి మహాభారత ప్రాజెక్టును పది భాగాలుగా తీస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఆ డ్రైవర్ పాత్రలో రాజమౌళిని చూపించి.. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. వీళ్లందరూ వద్దన్నా వద్దన్నా అని అరుస్తున్నట్లుగా ఒక మీమ్ తయారు చేసి వదిలారు. ఇది కూడా సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది.