బెల్లం హీరోకి టెన్షన్ టెన్షన్

మూడేళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం కోసం బెల్లకొండ సాయిశ్రీనివాస్ పడిన ఎదురు చూపులు రేపటితో ముగుస్తున్నాయి. ఛత్రపతి హిందీ రీమేక్ రేపు థియేటర్లలో విడుదల కానుంది. ఎలాగూ ప్రభాస్ ది చూసి చూసి అలసిపోయారు కాబట్టి తెలుగులో డబ్బింగ్ చేయడం లాంటి సాహసాలు చేయలేదు. కానీ నార్త్ ఆడియన్స్ దీన్ని సొంతం చేసుకుంటారన్న నమ్మకం హీరోకన్నా ఎక్కువ తండ్రి బెల్లంకొండ సురేష్ లో కనిపిస్తోంది. యూట్యూబ్ లో అయిదు వందల మిలియన్ల వ్యూస్ సినిమాలు తన కొడుక్కి ఉన్నాయని దీన్ని బట్టే అతని పాపులారిటీని అర్థం చేసుకోవచ్చని అన్నారు.

ఇదంతా బాగానే ఉంది కానీ ఉత్తరాది ట్రేడ్ లో ఛత్రపతి పట్ల ఏమంత హైప్ కనిపించడం లేదు. పెద్దగా పోటీ లేకపోవడంతో థియేటర్లు బాగానే దొరుకుతున్నాయి. గంగూబాయ్ కటియావాడి, ఆర్ఆర్ఆర్ నిర్మాతలు పెన్ స్టూడియోస్ నిర్మాణం కావడం వల్ల డిస్ట్రిబ్యూషన్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ట్రైలర్ కట్ కూడా గ్రాండ్ గా కనిపించింది. మూడు రోజుల క్రితం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఓ స్పెషల్ షో వేశారు కానీ ఆ ఫీడ్ బ్యాక్ బయటికి రాకుండా మేనేజ్ చేశారు. రిలీజ్ రోజు చెప్పమని అన్నారో లేక ప్రేక్షకులు స్క్రీన్ మీద సర్ప్రైజ్ అవ్వాలని ట్వీట్లు పెట్టించలేదో తెలియదు

మొత్తానికి ఇంకో ఇరవై నాలుగు గంటలు సాయిశ్రీనివాస్ కి టెన్షన్ తప్పదు. ఒకవేళ హిట్ అయ్యిందా మరికొన్ని ఆఫర్లు పట్టొచ్చు. పోతే మాత్రం ఇంత శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అసలు చూసేసిన పాత కథను పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి. అసలే బాలీవుడ్లో రీమేక్స్ అచ్చిరావడం లేదు. విక్రమ్ వేదా, హిట్ 1 ది ఫస్ట్ కేస్, జెర్సీ, షెహజాదా(అల వైకుంఠపురములో), యుటర్న్ ఇలా అన్నీ వరసగా ఫ్లాప్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఛత్రపతి ఎదురుగా పెద్ద సవాలే ఉంది. డబ్బింగ్ లేకపోయినా హిందీ వెర్షన్ ని ఏపీ తెలంగాణలోనూ రిలీజ్ చేస్తున్నారు