కస్టడీని మంచి రేట్లకు ఇచ్చేశారు

ఎల్లుండి విడుదల కాబోతున్న కస్టడీ మీద దర్శక నిర్మాతలు చాలా ధీమాగా ఉన్నారు. నిన్న చెన్నైలో తమిళ వెర్షన్ కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తి చేశారు. నాగార్జునకు శివ ఎలాగో నాగ చైతన్యకు ఈ కస్టడీ ఆలా నిలిచిపోతుందని నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి చెప్పడం చూస్తే కాన్ఫిడెన్స్ మాములుగా లేదనిపిస్తోంది. రిలీజ్ కు ముందు ఇలాంటి హైప్ స్టేట్ మెంట్స్ సహజమే కానీ చైతుకి సాలిడ్ బ్లాక్ బస్టర్ కావాల్సిన సమయంలో మంచి టైమింగ్ తో ఈ చిత్రం రావడం ఎంతమేరకు ఉపయోగించుకుంటుందో చెప్పాలి. 12న ఇది తప్ప చెప్పుకోదగ్గ బలమైన సినిమా ఇంకేదీ లేదు.

థియేట్రికల్ బిజినెస్ సుమారు 22 కోట్ల దాకా చేశారని టాక్. ఇది పెద్ద మొత్తమే కానీ టాక్ పాజిటివ్ గా వస్తే ఈజీగా రికవర్ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ రిలీజులు లేకపోవడం దీనికి కలిసి వచ్చేలా ఉంది. గమనించాల్సిన విషయం ఏంటంటే థాంక్ యుని ఇరవై నాలుగు కోట్లకు అమ్మితే మాస్ కంటెంట్ ఉన్న కస్టడీని అంతకన్నా తక్కువకే డీల్ చేసుకోవడం. ఎలాగూ తమిళ వెర్షన్ బాగా వెళ్లే ఛాన్స్ ఉంది కాబట్టి రికవరీ శాతం ఎక్కువగా ఉంటుంది. గతం వారం పదిరోజులుగా థియేటర్ల వద్ద ఏమంత సందడి కనిపించడం లేదు. ఇప్పుడు జనాన్ని రప్పించాల్సింది కస్టడీనే.

ఆపై వారం అన్నీ మంచి శకునములే, బిచ్చగాడు 2 ఉన్నాయి కానీ వాటి వల్ల కస్టడీకి వచ్చిన చిక్కేమి లేదు. చైతు మాత్రం గ్యారెంటీ హిట్ అనే నమ్మకం పూర్తిగా చూపిస్తున్నాడు. అదే నిజమైతే ఎంతలేదన్నా మూడు వారాలు స్ట్రాంగ్ రన్ ని ఆశించవచ్చు. అప్పుడు బ్రేక్ ఈవెన్ పది రోజుల్లోనే వచ్చేస్తుంది. కృతి శెట్టి, అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి లాంటి బలమైన క్యాస్టింగ్ ఉన్న కస్టడీకు సంబంధించిన రెండు పాటలను ఇంకా అఫీషియల్ గా రిలీజ్ చేయలేదు.నేరుగా స్క్రీన్ మీదే సర్ప్రైజ్ చేసేలా ఉంటాయట. ట్విస్టులు రివీల్ కాకూడదని ఇలా చేశారట