విరూపాక్ష 100 కోట్లు సాధ్యం కాదా

దసరా తర్వాత ఆ స్థాయిలో బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఒకే ఒక్క సినిమా విరూపాక్ష. హారర్ అంశాలతో రూపొంది ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతి కలిగించడంలో దర్శకుడు కార్తీక్ దండు చూపించిన పనితనం సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే అతి పెద్ద హిట్టు ఇచ్చింది. ఇప్పటిదాకా కలెక్షన్ల పరంగా 84 కోట్లకు పైగా గ్రాస్ 44 కోట్ల దాకా షేర్ వసూలు చేసిన విరూపాక్ష వంద కోట్ల మైలురాయి మీద కన్నేసింది. ఒక్క తెలుగులోనే అంటే కష్టం కనక వచ్చిన యునానిమస్ రెస్పాన్స్ ని దృష్టిలో ఉంచుకుని గత శుక్రవారం తమిళం, హిందీలో చెప్పుకోదగ్గ స్థాయిలోనే రిలీజ్ చేసింది

ప్రత్యేకంగా దీనికోసం తేజుతో పాటు సంయుక్త మీనన్ తదితరులు నార్త్ తో పాటు చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లి ప్రమోషన్లు చేశారు. అయితే ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. కారణాలు లేకపోలేదు. విరూపాక్షలో కార్తికేయ 2 లాగా దైవత్వానికి సంబంధించిన అంశాలు లేవు. అదే ఉంటే కనెక్టివిటీ పెరిగేది. ఈ దెయ్యాలు చేతబడులు వగైరాలు ఉత్తరాది ఆడియన్స్ కి కొత్త కాదు. రెగ్యులర్ గా ఈ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తూనే ఉంటాయి. సో హిందీ వెర్షన్ పై పెద్దగా ఆసక్తి చూపించలేదన్నది తేటతెల్లం

ఇక తమిళ సంగతి చూస్తే టాలీవుడ్ స్టార్ హీరోలను వాళ్ళు పట్టించుకోవడమే అరుదు. అలాంటిది తేజు లాంటి కొత్త ఫేస్ ని రిసీవ్ చేసుకోవడం అంత సులభంగా ఉండదు. పైగా పొన్నియిన్ సెల్వన్ అప్పటికి రెండో వారంలోనే ఉంది. దాంతో థియేటర్లు సైతం కోరినన్ని దొరకలేదు. ఈ పరిణామాల దృష్ట్యా ఇంకో రెండో రోజుల్లో రిలీజ్ అయ్యే మలయాళంలో ఏదో మేజిక్ చేస్తుందని ఆశించలేం. ఇంకో పదిహేను కోట్లు గ్రాస్ రావడమంటే మాటలు కాదు. ఈ ఫ్రైడే నాగ చైతన్య కస్టడీ ఒకటే ఉంది కాబట్టి దాని టాక్ ని బట్టి వీకెండ్ విరూపాక్షకు ఉపయోగపడుతుందో లేదో చెప్పొచ్చు