కొత్త డేట్ … ఈసారైనా నమ్మొచ్చా

ఎట్టకేలకు దగ్గుబాటి అభిరాం డెబ్యూ సినిమా అహింసకో రిలీజ్ డేట్ దొరికింది. జూన్ 2 థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ ఇలా ఇప్పటికి అయిదారు సార్లు జరిగింది. పోస్టర్లు వేయడం తీరా తేదీ దగ్గర పడేటప్పటికి సైలెంట్ అయిపోవడం ఇదో తంతుగా మార్చేశారు. ప్రేక్షకులు బయ్యర్లు తామంతా తాముగా పోస్ట్ పోన్ అని అర్థం చేసుకోవాల్సింది తప్పించి ప్రత్యేకంగా సురేష్ బాబు ఏనాడూ అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. జూన్ 2కి కట్టుబడితే మంచిదే కానీ పక్కానేనా అంటే చెప్పలేం

ఇటీవలే దర్శకుడు తేజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అహింసను నిర్మించిన ఇద్దరు ఐరావతాల్లాంటి ప్రొడ్యూసర్లకు ఏం చెప్తామని చేసిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది. అభిరాం తెరంగేట్రం విషయంలో సురేష్ బాబు అంత సీరియస్ గా లేరన్న కామెంట్స్ ముందు నుంచీ ఉన్నాయి. అన్నయ్య రానా బాబాయ్ వెంకటేష్ ఏనాడూ ఈ అహింస మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించిన దాఖలాలు లేవు. మరి కేవలం కొడుకు ముచ్చట తీర్చడానికి తీశారానే కామెంట్స్ కూడా వినిపించాయి. ఏదైతేనేం ఫైనల్ గా రూట్ క్లియర్ అయ్యింది. ఈ అహింస మీద ప్రస్తుతానికి ఎలాంటి బజ్ లేదు.

హీరోకేమో కానీ తేజకు అహింస సక్సెస్ చాలా కీలకం. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో సీత డిజాస్టరయ్యాక సురేష్ బాబు మళ్ళీ నమ్మి ఇచ్చిన అవకాశం ఇది. నేనే రాజు నేనే మంత్రితో మంచి సక్సెస్ ఇచ్చిన కారణంగానే ఈ ఛాన్స్ దక్కింది. ట్రైలర్ వచ్చి నెలలు దాటి పోయింది. స్టార్ హీరోలకే బజ్ రావడానికి కిందా మీద పడుతుంటే అహింస విషయంలో ఇంత తాపీగా ఉండటం ఓపెనింగ్స్ మీద నెగటివ్ గా ప్రభావం చూపిస్తుంది. తన మార్క్ ప్రేమకథనే ఎంచుకున్నప్పటికీ ఏదో కొత్త పాయింట్ టచ్ చేశారట. జూన్ 2తో పాటు ఆపై వారం చెప్పుకోదగ్గ రిలీజులు లేకపోవడం కొంత రిలీఫ్