పూజా హెగ్డే చేతికి మరో హిందీ మూవీ

వరస డిజాస్టర్లు పలకరిస్తున్నా సరే బాలీవుడ్ ని వదిలే ప్రసక్తే లేదంటోంది పూజా హెగ్డే. ఇటీవలే ఎంతో ఇష్టపడి కష్టపడి చేసిన కిసీకా భాయ్ కిసీకా జాన్ ఎంత పెద్ద ఫ్లాపో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సల్మాన్ ఖాన్ కెరీర్ లో టాప్ ఫైవ్ వరస్ట్ మూవీస్ లో చోటు దక్కించుకుంది. అంతకు ముందు సర్కస్ పరిస్థితి ఇంతకన్నా దారుణం. రణ్వీర్ సింగ్ – దర్శకుడు రోహిత్ శెట్టి లాంటి క్రేజీ కాంబినేషన్ అంత వరస్ట్ అవుట్ ఫుట్ ఇస్తుందని ఎవరూ ఊహించలేదు. అసలు ఎప్పుడో డెబ్యూ చేసిన హృతిక్ రోషన్ మొహంజాదారో నుంచి ఈ ఫలితం రిపీట్ అవుతూనే వస్తోంది.

వీటి సంగతలా ఉంచితే పూజా హెగ్డే మరో హిందీ ఆఫర్ పట్టేసింది. షాహిద్ కపూర్ హీరోగా రూపొందబోయే కోయి షక్ లో హీరోయిన్ గా ఎంపికయ్యిందని ముంబై అప్డేట్. దర్శకుడు రోషన్ ఆండ్రూస్. ఈయన మలయాళం డైరెక్టర్. దుల్కర్ సల్మాన్, మోహన్ లాల్, పృథ్విరాజ్ సుకుమారన్ లాంటి స్టార్లతో బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు. సుధీర్ బాబు రీమేక్ చేసుకున్న హంట్ ఒరిజినల్ వెర్షన్ ముంబై పోలీస్ ఈయనదే. మిస్టరీ థ్రిల్లర్స్ డీల్ చేయడంలో రోషన్ ది ప్రత్యేక శైలి. మొదటిసారి హిందీ డెబ్యూ చేయబోతున్నారు. టైటిల్ చూడగానే ఇది కూడా సస్పెన్స్ క్యాటగిరీని అర్థమైపోతోంది

ఇక టాలీవుడ్ విషయానికి వస్తే పూజా హెగ్డే ఆశలన్నీ మహేష్ బాబు 28 మీదే ఉన్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ కం యాక్షన్ ఎంటర్ టైనర్ తన ఫ్లాపుల ప్రహసనానికి బ్రేక్ వేస్తుందని ఎదురు చూస్తోంది. గత ఏడాది రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య ఇచ్చిన షాకులు చిన్నవి కాదు. దీంతో మార్కెట్ డిమాండ్ మీద ప్రభావం పడింది. ఒకపక్క శ్రీలీల పదికి పైగా సినిమాలతో దూసుకుపోతూ టాప్ వన్ ర్యాంక్ మీద కన్నేసింది. ఇప్పుడు వెనుకబడకుండా ఉండాలంటే పూజాకు ఏ భాష అయినా సరే సాలిడ్ గా రెండు బ్లాక్ బస్టర్లు పడాల్సిందే.