టైగర్ భర్తలు బాగానే నవ్వించారు

గత కొంత కాలంగా చెప్పుకోదగ్గ వెబ్ సిరీస్ లు ఏ భాషలోనూ రాలేదు. సైకో కిల్లింగ్ లు, థ్రిల్లర్ లు తప్ప ఈ జానర్లో ఎంటర్ టైన్మెంట్ తీసేవాళ్ళు తగ్గిపోయారు. ఆహాలో వస్తున్నాయి కానీ అవేమంత ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిన సేవ్ ది టైగర్స్ జనాన్ని బాగానే ఆకట్టుకుంటోంది. తేజ కాకుమాను దర్శకత్వం వహించిన ఈ కామెడీ షోకి మహి రాఘవ నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించారు. డిస్నీ హాట్ స్టార్ లో ఈ మధ్యే ఆరు ఎపిసోడ్లతో ఫస్ట్ సీజన్ వచ్చేసింది. సోషల్ మీడియా ట్వీట్లు గమనిస్తే స్పందన బాగున్నట్టే ఉంది

ఇది వెంకటేష్ ఎఫ్ 2, ఎఫ్ 3 స్ఫూర్తితో సాగుతుంది. భార్యల వల్ల వ్యక్తిగత జీవితంలో అసంతృప్తిగా ఉన్న ముగ్గురు భర్తలు స్నేహితులుగా మారతారు. ఈ క్రమంలో జరిగే సంఘటనలు మరిన్ని అపార్థాలకు దారి తీసి విచిత్ర పరిణామాలను తీసుకొస్తాయి. ఇంట్లో పిల్లి వీధిలో పులిగా భావించే ఈ పురుష పుంగవుల లైఫ్ లో జరిగిన కామెడీనే ఈ సేవ్ ది టైగర్స్. బర్రెలు కాసుకునే గంట రవిగా ప్రియదర్శి, కథలు రాసుకునే వంకతో ఇంట్లోనే ఉంటూ టైం వేస్ట్ చేసే రాహల్ గా అభినవ్ గోమటం, క్రియేటివ్ ఫీల్డ్ లో బాస్ తో తిట్లు తినే ఉద్యోగిగా విక్రమ్ గా చైతన్య కృష్ణ ముగ్గురు పర్ఫెక్ట్ గా సరిపోయారు

సింపుల్ పాయింట్ ని సహజ ధోరణిలో డీల్ చేసిన విధానం బాగుంది. మధ్యలో కొంత ల్యాగ్ ఉన్నప్పటికీ మరీ ఎక్కువ బోర్ కొట్టకుండా నడిపించిన తీరు వన్ టైం వాచ్ గా మార్చేసింది. భార్యలుగా. జోర్దార్ సుజాత, పల్లవి గంగిరెడ్డి, దేవయానిల సహజమైన పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంటుంది. పగలబడి నవ్వే రేంజ్ లో కాకపోయినా నవ్వుకోవడానికి లోటు లేకుండా డిజైన్ చేశారు. చివరి ఎపిసోడ్ కొంత అసంతృప్తికి లోను చేసినా ఆర్టిస్టుల టైమింగ్ తో పాటు ఈజీగా కనెక్ట్ అయ్యే హైదరాబాద్ నేటివిటీ ప్లస్ అయ్యింది. మొత్తంగా చూస్తే వినోదాన్ని అందించడంలో టైగర్స్ బాగానే వర్కౌట్ చేశారు