‘డియర్ కామ్రేడ్’ మ్యాజిక్ రిపీటవుతుందా?

ఫలానా దర్శకుడి సినిమాలో పాటలు బాగుంటాయి.. మంచి అభిరుచితో మ్యూజిక్ చేయించుకుంటాడు అనే అభిప్రాయం ఉంటుంది కానీ.. ఫలానా హీరో సినిమాలో పాటలు బాగుంటాయి అని చాలా కొద్దిమంది విషయంలోనే చెప్పగలుగుతాం. టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ఈ కోవకే చెందుతాడు.

విజయ్ సినిమాలో పాటలు బాగుండటంలో తన పాత్ర ఎంత వరకు ఉంటుందో చెప్పలేం కానీ.. అతడి సినిమాల్లో చాలా వరకు మ్యూజికల్ హిట్సే. ముఖ్యంగా విజయ్ క్లాస్ టచ్ ఉన్న లవ్ స్టోరీలు చేశాడంటే పాటలు చాలా బాగుంటాయని నమ్మకం పెట్టుకోవచ్చు.

పెళ్ళి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, డియర్ కామ్రేడ్.. ఈ వరస చూస్తే ఆ విషయం నిజమే అని ఎవ్వరైనా ఒప్పుకుంటారు. వీటిలో ‘డియర్ కామ్రేడ్’ ఆల్బమ్ చాలా చాలా స్పెషల్. గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన బెస్ట్ ఆల్బమ్‌ల్లో ఇదొకటి. అందులో ప్రతి పాటా మెస్మరైజింగ్‌గా అనిపిస్తుంది.

విజయ్ కెరీర్లో మళ్లీ అలాంటి ఆల్బమ్ రావడం అంటే కష్టమే. ఐతే ‘ఖుషి’ సినిమాతో ఆ మ్యాజిక్ రిపీటయ్యే ఛాన్సుందని అంటున్నాయి చిత్ర వర్గాలు. ఈ చిత్ర దర్శకుడు శివ నిర్వాణకు సంగీతం విషయంలో మంచి అభిరుచి ఉంది. నిన్ను కోరి, మజిలీ సినిమాల్లో చాలా మంచి పాటలు చేయించుకున్నాడు.

ఆ సినిమాల తరహాలోనే విజయ్‌తో అతను పూర్తి స్థాయి లవ్ స్టోరీ తీస్తున్నాడు. ప్రేమకథలు అనగానే పాటలకు మంచి స్కోప్ ఉంటుంది. మంచి ఫీల్ ఉన్న మ్యూజిక్ ఇవ్వడానికి అవకాశముంటుంది. ఈ చిత్రానికి మలయాళ మ్యూజిక్ సెన్సేషన్ హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తుండటం విశేషం.

అతను ‘హృదయం’ సినిమాలో అదిరిపోయే పాటలతో యూత్‌ను ఉర్రూతలూగించాడు. ‘దర్శనా…’ పాట అయితే మామూలు హిట్ అవ్వలేదు. ‘ఖుషి’ సినిమాకు అతణ్ని సంగీత దర్శకుడిగా ఎంచుకోవడంతోనే శివ తన అభిరుచిని చాటాడు.

ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోలోనే తన మ్యాజిక్ చూపించాడు హేషమ్. ఇప్పుడు సినిమా నుంచి రిలీజ్ కానున్న ‘నువ్వే నా రోజా’ ప్రోమో చూస్తే ఒక చార్ట్ బస్టర్ సాంగ్ రాబోతోందని అర్థమవుతోంది. ఆల్బం మొత్తం కూడా మంచి పాటలు ఆశించవచ్చు. చూద్దాం ‘డియర్ కామ్రేడ్’ మ్యాజిక్ రిపీటవుతుందేమో.