బ్లాక్‌బస్టర్ సంస్థకు దిష్టి చుక్క

Ramabanam
Ramabanam

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. ఈ మధ్య కాలంలో ఈ సంస్థ పేరు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది కార్తికేయ, దసరా లాంటి బ్లాక్ బస్టర్లు అందుకుంది ఆ సంస్థ. దీనికి తోడు ప్రభాష్, పవన్ కళ్యాణ్ లాంటి టాప్ స్టార్లతో సినిమాలు లైన్లో పెట్టడంతో అందరూ ఆ సంస్థ గురించి మాట్లాడుకున్నారు.

వీటికి తోడు చర్చల దశలో, ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నవి కలుపుకుంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో దాదాపు 30 సినిమాల దాకా లైన్లో ఉన్నట్లు వచ్చిన వార్తలు సంచలనం రేపాయి. రాబోయే రోజుల్లో టాలీవుడ్ అనే కాక మొత్తం ఇండియాలో టాప్ ప్రొడక్షన్ హౌస్‌ల్లో ఒకటిగా పీపుల్స్ మీడియా నిలవబోతోందన్న సంకేతాలు కనిపించాయి.

అలాంటి ఊపులో ఉన్న సంస్థకు ఇప్పుడు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. యాక్షన్ హీరో గోపీచంద్‌తో ఆ సంస్థ నిర్మించిన ‘రామబాణం’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. వీకెండ్ అవ్వకముందే ఈ సినిమా చతికిలపడటాన్ని బట్టి ఎంత పెద్ద డిజాస్టరో అర్థం చేసుకోవచ్చు.

కేవలం కాంబినేషన్ చూసి ఈ సినిమాకు టెంప్ట్ అయిపోయినట్లుంది పీపుల్స్ మీడియా. గోపీచంద్, శ్రీవాస్‌ల కలయికలో ఇంతకుముందు వచ్చిన లక్ష్యం, లౌక్యం సూపర్ హిట్లు అయ్యాయి. వీరి కలయికలో మూడో సినిమా అనగానే.. గోపీ, శ్రీవాస్‌ల ట్రాక్ రికార్డు పట్టించుకోలేదు.

నిజానికి ‘రామబాణం’ కథను వేరే ప్రొడక్షన్ హౌస్ తిరస్కరించగా.. పీపుల్స్ మీడియా వాళ్లు ఓకే చేసి పట్టాలెక్కించారట. కాంబినేషన్ క్రేజ్ చూసి అయిన కాడికి బడ్జెట్ పెట్టేశారు. అది రూ.40 కోట్లు దాటిపోయినట్లు తెలుస్తోంది. చివరికి చూస్తే పేలవమైన ట్రైలర్ కారణంగా సినిమాకు సరిగ్గా బిజినెస్ కూడా జరగలేదు. డెఫిషిట్‌తో రిలీజ్ చేశారు. మార్నింగ్ షోతోనే సినిమా ప్రేక్షకుల తిరస్కరణకు గురైంది.

తర్వాత ఏమాత్రం పుంజుకోలేకపోయింది. నిర్మాతలు కార్తికేయ, దసరా సినిమాలతో సంపాదించిందతా ‘రామబాణం’తో పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. బ్లాక్ బస్టర్ నిర్మాణ సంస్థకు ఇదొక దిష్టి చుక్క అనుకోవచ్చు. ఇకనైనా పీపుల్స్ మీడియా అధినేతలు జాగ్రత్తగా సినిమాలు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరముంది.