నిన్న విడుదలైన రామబాణంకు ఆశించిన స్పందన కనిపించడం లేదు. మొదటి రోజు వసూళ్లు మరీ తీసికట్టుగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కనీసం రెండు కోట్లు రాబట్టలేని స్టేజికి గోపీచంద్ దిగిపోవడం ఊహించనిది. నిజానికి దీని మీద ప్రీ రిలీజ్ బజ్ భారీగా లేకపోయినా మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అండతో గట్టెక్కుతుందనే నమ్మకం ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు టీమ్ లో కనిపించింది. కానీ వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. వీకెండ్ రెండు రోజులు ఏదోలా గడిచినా సోమవారం నుంచి వచ్చే డ్రాప్ ఏ స్థాయిలో ఉంటుందోననే టెన్షన్ బయ్యర్లలో వ్యక్తమవుతోంది.
గోపీచంద్ కిది హైటైం. రొటీన్ ఫార్ములాలో తాను ఇమడలేకపోవడమో లేదా సరిగా వాడుకునే దర్శకులు దొరక్కపోవడమో కారణం ఏదైతేనేం మార్కెట్ అయితే దెబ్బ తింటోంది. పక్కా కమర్షియల్ లాంటి కోర్టు డ్రామా చేసినా, సీట్ మార్ లాంటి స్పోర్ట్స్ మూవీ చేసినా అన్నిటిలో అవసరానికి మించి కమర్షియల్ ఎలిమెంట్స్ ఇరికించడం వల్ల ఫలితాలు రిపీట్ అవుతున్నాయి. లౌక్యం నాటి కాలం కాదిది. విరూపాక్షలో హారర్ అంశాలున్నా జనం బ్రహ్మాండంగా ఆదరించారు. కృష్ణుడి కాన్సెప్ట్ ని తీసుకున్న కార్తికేయ 2తో నిఖిల్ ప్యాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ కొట్టాడు.
ఇలాంటివి గోపీచంద్ చేయలేదని కాదు. సాహసం ఇప్పుడు చూసినా మంచి అడ్వెంచర్ ఫీల్ వస్తుంది. ఒక్కడున్నాడులో యునీక్ పాయింట్ ని మళ్ళీ ఎవరు టచ్ చేయలేకపోయారు. మాస్ ఇమేజ్ ఉన్న టైంలో అవి చేయడం వల్ల రెవిన్యూ పరంగా అద్భుతాలు చేయలేకపోయాయి కానీ ఒకవేళ ఇప్పుడైతే రిలీజ్ కు ముందే ఓటిటి ద్వారా కోట్ల రూపాయల సొమ్ములు నిర్మాతలకు తెచ్చి పెట్టేవి. సో గోపిచంద్ కనక విభిన్నమైన ఆలోచనలున్న యంగ్ డైరెక్టర్స్ తో జట్టు కడితే తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వడం పెద్ద విషయం కాదు. కథలు ఎంచుకునేటప్పుడు తస్మాత్ జాగ్రత్త అనుకుంటే చాలు