అల్ల‌రోడికి అడ్వాంటేజ్

Allari naresh
Allari naresh

ఈ వేస‌విలో భారీ చిత్రాలు లేక‌పోవ‌డం ప్రేక్ష‌కుల‌కు తీవ్ర నిరాశ క‌లిగించేదే. పోనీ ఉన్న వాటిలో అయినా స‌రైన సినిమాలు ప‌డుతున్నాయా అంటే అదీ లేదు. ఈ స‌మ్మ‌ర్లో ఇప్ప‌టిదాకా పూర్తిగా సంతృప్తి పరిచి ప్రేక్ష‌కుల‌ను ఉర్రూతలూగించిన సినిమా ఏదీ లేదన‌డంలో సందేహం లేదు. ఉన్నంత‌లో ద‌స‌రా, విరూపాక్ష సినిమాల‌కు మంచి టాక్ వ‌చ్చింది. వాటినే ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేశారు. మిగ‌తా సినిమాల‌న్నీ తుస్సుమ‌నిపించిన‌వే.

గ‌త వారం వ‌చ్చిన ఏజెంట్ అయితే వీకెండ్లోనే వాషౌట్ అయిపోయింది. ఇక ఈ వారం రెండు మిడ్ రేంజ్ సినిమాలు బాక్సాఫీస్ బ‌రిలో నిలిచాయి. అందులో గోపీచంద్ సినిమా రామ‌బాణం.. ట్రైల‌ర్‌తో ఎలా ఉస్సూరుమ‌నిపించిందో.. అంత‌కుమించి సినిమాగా అంత‌కుమించి నిరాశ‌కు గురి చేసింది. త‌క్కువ అంచ‌నాల‌తో వెళ్లిన‌ప్ప‌టికీ.. మినిమం ఎంట‌ర్టైన్మెంట్ ఇవ్వ‌లేక‌పోయిందీ సినిమా.

రామ‌బాణం టాక్ కానీ.. ఓపెనింగ్స్ కానీ ఏమాత్రం ఆశాజ‌న‌కంగా లేవు. దీంతో పాటు రిలీజైన ఉగ్రం సినిమా మాత్రం బెట‌ర్ టాక్ తెచ్చుకుంది. అల్ల‌రి న‌రేష్‌, విజ‌య్ క‌న‌క‌మేడ‌ల కాంబినేష‌న్లో వచ్చిన తొలి చిత్రం నాంది స్థాయిలో లేక‌పోయినా.. ఇది కూడా విష‌యం ఉన్న సినిమానే. కొన్ని ఎపిసోడ్లు ఆక‌ట్టుకుంటున్నాయి. సినిమాలో కొన్ని మెరుపులున్నాయి. అల్ల‌రి న‌రేష్ పెర్ఫామెన్స్ కూడా మెప్పిస్తోంది.

ఏమీ లేని స‌మ‌యంలో ఓ మోస్త‌రు సినిమా ప‌డ్డా ప్రేక్ష‌కులు సంతృప్తి చెందుతారు. రెండు వారాల ముందు వ‌చ్చిన విరూపాక్ష ఇప్ప‌టికీ ప్ర‌భావం చూపుతున్న‌ప్ప‌టికీ.. ప్రేక్ష‌కుల‌కు కొత్త సినిమాల‌ మీద ఆస‌క్తి ఎక్కువ ఉంటుంది. అందులో టాక్ బాగున్న‌దాన్ని ఎంచుకుంటారు. ఈ ర‌కంగా ఉగ్రంకి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అడ్వాంటేజ్ పొజిష‌న్ ఉన్న‌ట్లే. ఈ సానుకూల‌త‌ను ఉప‌యోగించుకుంటే న‌రేష్ కెరీర్లో ఇంకో హిట్ ప‌డ‌బోతున్న‌ట్లే.