తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొని వెళ్లి ఐదు రోజులు దాటింది. కానీ ఈ వేడుకల్లో చంద్రబాబును పొగిడారన్న ఒకే ఒక్క కారణంతో.. ఆ వేడుక ముగిసిన కొన్ని గంటల నుంచే వైసీపీ శ్రేణులు ఆయన్ని దారుణమైన రీతిలో టార్గెట్ చేస్తున్నాయి. వైసీపీని కానీ, జగన్‌ను కానీ పల్లెత్తు మాట అనకపోయినా.. రాజకీయాల జోలికే రజినీ వెళ్లకపోయినా.. వైసీపీ శ్రేణులు తగ్గట్లేదు. పెద్ద పెద్ద నాయకులు మీడియా ముందుకు వచ్చి బూతులు తిట్టేశారు.
ఆయన వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడ్డారు. చివరికి దివంగత సిల్క్ స్మితతో ముడిపెట్టి ఆయన క్యారెక్టర్‌ను దెబ్బ తీసే ప్రయత్నం కూడా చేసేశారు. తెలుగుదేశం వాళ్లతో పాటు తటస్థులు రజినీకి బాసటగా నిలిచే ప్రయత్నం చేస్తుంటే.. రజినీ ఫ్యాన్స్ ఎదురు దాడి చేస్తుంటే.. వైసీపీ ఎటాక్ ఇంకా పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. ఇలాంటి సమయంలో సీనియర్ నటుడు జగపతిబాబు.. రజినీకి మద్దతుగా మాట్లాడ్డం గమనార్హం. ఆయన రాజకీయాలు మాట్లాడకుండానే రజినీకి సపోర్ట్ చేయడం ద్వారా వైసీపీకి ఇన్‌డైరెక్ట్ పంచ్ ఇచ్చాడు.
తాను కీలక పాత్ర పోషించిన ‘రామబాణం’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన జగపతిబాబుకు.. ఇటీవల రజినీ మీద వైసీపీ ఎటాక్.. సిల్క్ స్మితతో ముడిపెడుతూ చేసిన ఆరోపణల గురించి ఫిలిం జర్నలిస్టులు ప్రస్తావించారు. ఐతే ఆ సంగతి తనకు తెలియదు అంటూనే.. రజినీని కొనియాడాడు జగపతిబాబు.
“రజినీకాంత్ ఎప్పుడు మాట్లాడినా చక్కగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే విధానం పర్ఫెక్ట్. అలాగే ఆయన నిజాలు మాట్లాడతాడు. రజినీ వంద శాతం రైట్” అని జగపతి అన్నాడు. అంటే ఇటీవల రజినీ చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం నిజమని జగపతి అంటున్నట్లే. వైసీపీ వాళ్లను ఖండించకపోయినా.. వాళ్లు చేస్తున్నది తప్పు అని జగపతిబాబు చెప్పకనే చెప్పినట్లు అయింది. రజినీతో జగపతిబాబు ‘కథానాయకుడు’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ టైంలో రజినీతో కలిసి నటించడంపై జగపతి ఎంతో ఎమోషనల్ అయ్యాడు కూడా.
Gulte Telugu Telugu Political and Movie News Updates