రాజమౌళి గారూ.. ఆ సినిమా తీయరూ!

‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో రాజమౌళి ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. సినీ రంగంలోనే కాదు.. అనేక రంగాల్లో రాజమౌళికి అపారమైన పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. వివిధ రంగాల ప్రముఖులు కూడా జక్కన్నకు అభిమానులుగా మారిపోయారు. అందులో ఆనంద్ మహీంద్రా కూడా ఒకరు. రాజమౌళి మీద గతంలోనూ ఆయన తన అభిమానాన్ని చాటుకున్నారు. తాజాగా ఆయన జక్కన్నకు ఒక సినిమా తీయాలనే సూచన చేయడం విశేషం. అందుకు రాజమౌళి కూడా స్పందించాడు. ఇదంతా ట్విట్టర్లో జరిగిన సంభాషణ కావడం గమనార్హం.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా.. తాజాగా సింధు నాగరికతకు సంబంధించిన ఒక ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. “ఇలాంటి ఫొటోలు మన చరిత్రకు జీవం పోస్తాయి. మన ప్రతిభను ప్రతిబింబిస్తాయి. నాటి పరిస్థితులు ప్రపంచానికి తెలిసేలా వీటిపై ఒక సినిమా తీయగలరా” అని రాజమౌళిని ట్యాగ్ చేసి అడిగారు ఆనంద్ మహీంద్రా. దీనికి వెంటనే జక్కన్న స్పందించాడు. ‘మగధీర’ రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు.

“మేం మగధీర సినిమా షూటింగ్ ధోలావీరాలో చేశఆం. ఆ సమయంలో అక్కడున్న ఒక చెట్టు నన్నెంతో ఆకర్షించింది. దాని ఆధారంగా సింధు నాగరికత ఎలా అభివృద్ధి చెందింది.. ఎలా అంతరించింది అని చూపిస్తూ ఒక సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది. కొన్నేళ్ల తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లాను. అక్కడ మొహెంజదారోకు వెళ్లి పరిశోధన చేయాలని ప్రయత్నించా. కానీ అనుమతులు రాలేదు” అని రాజమౌళి వెల్లడించారు. మరి ఆనంద్ మహీంద్రా ఏమైనా పూనుకుని ఈ విషయంలో రాజమౌళికి సాయం చేసి.. తన పరిశోధన పూర్తి చేసేలా చేస్తారా.. నిజంగానే భవిష్యత్తులో సింధు నాగరికత మీద జక్కన్న సినిమా తీస్తాడా అన్నది చూడాలి. ఐతే మొహెంజదారో సంస్కృతి మీద బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ సినిమా తీస్తే అది చేదు అనుభవాన్ని మిగిల్చిన విషయం మరువరాదు.