కోడి రామ్మూర్తి నాయుడుగా రామ్ చరణ్ ?

ఇంకా షూటింగ్ మొదలుకాకుండానే రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో రూపొందబోయే సినిమాకు సంబంధించిన ప్రచారాలు అభిమానుల మధ్య ఊపందుకున్నాయి. ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందనే విషయం చాన్నాళ్ల క్రితమే లీకయ్యింది. అయితే ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు కాబట్టి ఏదీ నిర్ధారణగా చెప్పేందుకు యూనిట్ అందుబాటులో లేదు. తాజాగా ఒక ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఇది బాడీ బిల్డర్ కోడి రామ్మూర్తి నిజ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని కథను రాసుకున్నారని సమాచారం.

ఇంతకీ ఇంత గొప్ప వ్యక్తి ఎవరని ఆరాతీసే పనిలో పడ్డారు మెగా ఫ్యాన్స్. ఈయన పూర్తి పేరు కోడి రామమూర్తి నాయుడు. భారతదేశానికి స్వాతంత్రం రాక ముందే కన్నుమూశారు. రెజ్లర్, బాడీ బిల్డర్ గా పేరొందిన ఈ దిగ్గజం అప్పట్లోనే కింగ్ జార్జ్ ఫైవ్ నుంచి ఇండియన్ హెర్క్యూలెస్ బిరుదును అందుకున్నారు. స్వస్థలం విశాఖపట్నంలోని వీరఘట్టం గ్రామం. చిన్నప్పుడే తల్లి చనిపోతే విజయనగరం వచ్చి ఇన్స్ పెక్టర్ గా పని చేస్తున్న మావయ్య దగ్గర చదువుకుంటూ కుస్తీ పోటీలు మల్ల యుద్ధాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఓటమిని చూసేవారు కాదు.

ఏనుగు పాదాన్ని ఛాతి మీద పెట్టించుకోవడం, మీసాలతో బళ్ళు లాగడం లాంటి ఎన్నో సాహసాలు చేసేవారు. కోడి రామ్మూర్తి బయోపిక్ లో ఎన్నో విశేషాలున్నాయి. యధాతధంగా తీసుకోకుండా ఆయన లైఫ్ లోని ముఖ్యమైన లైన్ ని మాత్రమే తీసుకుని దాన్ని పీరియాడిక్ డ్రామాగా మార్చి డ్యూయల్ రోల్ లో చరణ్ ని చూపించే ప్లాన్ లో బుచ్చిబాబు ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. మొత్తానికి నేపథ్యం ఆసక్తికరంగా ఉంది కానీ అధికారికంగా చెప్పలేదు కాబట్టి ప్రస్తుతానికి ఊహాగానాల వరకే పరిమితమనుకోవాలి. గేమ్ చేంజర్ షూటింగ్ గుమ్మడికాయ కొడితే కానీ ఆర్సీ 16కి సంబంధించి క్లారిటీ రాదు .