నానిని నేచురల్ స్టార్‌ను చేసిన సినిమా భలే భలే మగాడివోయ్. ఆ సినిమా ముందు వరకు అతడి మార్కెట్ ఐదారు కోట్లలో ఉండేది. కానీ ఆ చిత్రం ఏకంగా రూ.50 కోట్ల మేర గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం రేపింది. ఈ సినిమాతో దర్శకుడు మారుతి కూడా ఒకేసారి చాలా మెట్లు ఎక్కేశాడు. అంతకుముందు అతడి కెరీర్లో హిట్లున్నా బూతు డైరెక్టర్ అన్న ముద్ర ఉండేది. కానీ ఈ చిత్రంతో క్లీన్ ఎంటర్టైన్మెంట్ అందించి అన్ని వర్గాల ప్రజలనూ ఉర్రూతలూగించాడు.
ఈ సినిమా తర్వాత నాని, మారుతిల కెరీర్ మాంచి ఊపులో సాగింది. చివరగా నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో పలకరించాడు. వి విడుదలకు సిద్ధంగా ఉంది. దీని తర్వాత టక్ జగదీష్, శ్యామ్ సింగ రాయ్ చిత్రాల్ని లైన్లో పెట్టాడు. మారుతి తర్వాతి చిత్రం సంగతి ఇంకా తేలలేదు. ఐతే అతను తర్వాతి ప్రాజెక్టుకు స్క్రిప్టు రెడీ చేసేశాడని.. ఆ కథను నానికి వినిపించాడని.. అతను సుముఖత వ్యక్తం చేశాడని.. వచ్చే ఏడాది వీరి కాంబినేషన్లో కొత్త చిత్రం పట్టాలెక్కబోతోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
భలే భలే మగాడివోయ్ చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్-2 బేనర్ మీదే బన్నీ వాసు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశాలున్నాయంటున్నారు. త్వరలోనే ఈ చిత్రం గురించి ప్రకటన వెలువడే అవకాశముంది. నాని-మారుతి కలయికలో అంటే మరోసారి ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనరే ఆశిస్తారు ప్రేక్షకులు. సినిమాపై అంచనాలు కూడా బాగానే ఉంటాయనడంలో సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates