మంగళవారం ఇంత బోల్డ్ ఎందుకంటే

ఆరెక్స్ 100 రూపంలో తొలి చిత్రంతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఆ టైంలో టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారడం అతిశయోక్తి కాదు. ఆ తర్వాత మహా సముద్రం కథ రాసుకుని ఒకరిద్దరు హీరోల దగ్గరకు వెళ్లి ఫైనల్ స్టేజి దగ్గర ఆగిపోయి ఇబ్బంది పడ్డ ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఫైనల్ గా శర్వానంద్, సిద్దార్థ్ లతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఊహించని విధంగా అది డిజాస్టర్ కావడం అజయ్ మార్కెట్ ని ప్రభావితం చేసింది. తన టేకింగ్ పట్ల ఆసక్తి ప్రదర్శించిన పెద్ద హీరోలు తర్వాత పెండింగ్ లో పెట్టారు. అందుకే ఈసారి మరో రిస్కుకి రెడీ అయ్యాడు.

నిర్మాణ భాగస్వామిగా తన స్వీయ దర్శకత్వంలో అజయ్ భూపతి మంగళవారం తీస్తున్నారు. ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మొదటి సినిమా సక్సెస్ లో దన్నుగా నిలిచిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ని ప్రధాన భూమికకు తీసుకున్నారు. వెనుక భాగం శరీరం సగం దాకా నగ్నంగా వదిలిన స్టిల్ యూత్ ని బాగా టార్గెట్ చేసేలా ఉంది. ఇటీవలే విరూపాక్షకు అద్భుతమైన నేపధ్య సంగీతం అందించిన అజనీష్ లోకనాథ్ దీనికి సంగీత దర్శకత్వం వహించడం విశేషం. దాదాపుగా తనతో ముందు నుంచి పని చేస్తున్న టీమ్ నే ఎంచుకున్న అజయ్ ఈసారి సింపుల్ క్యాస్టింగ్ నే తీసుకున్నాడు.

ఇదంతా బాగానే ఉంది కానీ మంగళవారం టైటిల్ వెనుక కారణం ఏమై ఉంటుందా అనే సందేహం రావడం సహజం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇదో క్రైమ్ అండ్ ఎరోటిక్ థ్రిల్లర్. మొత్తం పాయల్ చుట్టే తిరుగుతుంది. హత్యలు జరగడం వెనుక ఎవరూ ఊహించని ఒక ట్విస్టు ఉంటుంది. అది వింటే మగరాయుళ్ళు వెన్నులో వణుకు పుట్టేలా అజయ్ భూపతి నెరేషన్ ఉంటుందట. తారాగణం ఇతర వివరాలు ఇంకా రివీల్ చేయాల్సి ఉంది. ఏదో ఒక షాకింగ్ ఎలిమెంట్ లేనిదే ఆడియన్స్ ని మెప్పించడం కష్టమైపోతున్న ట్రెండ్ లో అజయ్ ఎలాంటి కథను చెప్పబోతున్నాడో చూడాలి.