మాములుగా హీరోయిన్లు ఎంత స్టార్ డం చూసినా కెరీర్ మహా అయితే పది పదిహేను సంవత్సరాలకు మించి ఉండదు. హీరోలు అరవై దాటినా డ్యూయెట్లు పాడుకోవచ్చు కానీ బ్యూటీస్ కి ఆ ఛాన్స్ దొరకదు. ఆ వయసు వచ్చేసరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి వదినా అక్క అత్తయ్య అంటూ పిలిపించుకోవాల్సిందే. రోజా, రమ్యకృష్ణ, ఇంద్రజ, ఆమని, మధుబాల ఇలా చెప్పుకుంటూ పొతే లిస్టు చాలా పెద్దది ఉంటుంది. ముప్పై అయిదు వచ్చేనాటికే వీళ్లంతా ఫామ్ తగ్గిపోయి పాత్రల ఎంపికలో రూటు మార్చుకున్నారు. కానీ త్రిష మాత్రం తాను చాలా స్పెషలని రుజువు చేస్తోంది
నిన్న జరిగిన పొన్నియిన్ సెల్వన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అందరి కళ్ళు త్రిష మీదే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. తనకంటే చాలా చిన్నవాళ్ళైన శోభిత ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మిల మీద దృష్టి పెద్దగా లేదు. అంత డార్క్ అవుట్ ఫిట్ లో చీరలోనూ సుకుమారం సౌందర్యం కలగలిసిన త్రిషని చూస్తే మాత్రం ఏదో రెండు మూడేళ్ళ క్రితం డెబ్యూ చేసిన అమ్మాయిలా ఉంది. ఇంత ప్రత్యేకంగా చెప్పుకోవడానికి కారణం ఉంది. 2002లో మౌనం పెసియాదైతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన త్రిష మరుసటి ఏడాది నీ మనసు నాకు తెలుసుతో తెలుగులో అడుగు పెట్టింది.
అక్కడి నుంచి ఎన్నో బ్లాక్ బస్టర్లు ఎన్నో డిజాస్టర్లు అన్నీ చూసింది. చిరంజీవి బాలయ్య నుంచి మహేష్ బాబు ప్రభాస్ దాకా అందరితో జోడి కట్టింది. రెండు దశాబ్దాల తర్వాత పీఎస్ 2లో కుందవైగా అంతపెద్ద మల్టీ స్టారర్ క్యాస్టింగ్ లోనూ ప్రధాన ఆకర్షణగా మారడం అంటే చిన్న విషయం కాదు . నాలుగు పదుల వయసుకి నెలల దూరంలో ఉన్న త్రిష గ్లామర్ సీక్రెట్ ఏంటో కానీ స్టేజి మీద విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ ఇలా అందరూ తనని ప్రత్యేకంగా ప్రశంసలతో ముంచెత్తడం విశేషం. విజయ్ లాంటి స్టార్ హీరోనే లియో కోసం త్రిష కన్నా బెస్ట్ ఛాయస్ లేదని ఫీలవ్వడం ఇందుకేనేమో