మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బన్నీ మూవీ పుష్ప సినీ నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ ఇళ్లు, ఆఫీసులపై ఐటీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారం వైసీపీ నేత, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా చుట్టుకుంది. మైత్రీ మూవీస్‌లో ఆయన పెట్టుబడులు పెట్టారంటూ.. టీడీపీ నేతలు కొందరు వ్యాఖ్యానించారు. దీనిపై తాజాగా రియాక్ట్ అయిన బాలినేని మైత్రీ మూవీస్లో తనకు గానీ తన వియ్యంకుడికి గానీ పెట్టుబడులు ఉన్నాయని నిరూపిస్తే ఇద్దరి ఆస్తులు రాసిస్తామని సవాల్ రువ్వారు.
అంతే కాదు, తాను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానని అన్నారు. మైత్రి మూవీస్లో తనకు పెట్టుబడులు ఉన్నాయని జనసేన కార్పొరేటర్, కొందరు టీడీపీ నేతలు ఆరోపించారని… ఈ ఆరోపణలను నిరూపిస్తే ఎలాంటి చర్యకైనా సిద్ధమని ఆయన అన్నారు. మైత్రి మూవీస్లో కొద్ది రోజుల నుంచి ఆదాయ పన్ను శాఖ దాడులు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా ఐటీ శాఖను తన మీదకు ఉసిగొలిపే విధంగా ఆరోపణలు చేస్తున్నారని మండపడ్డారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా సినిమా వాళ్లే కాబట్టి.. సినిమా సంబంధాలు ఉన్నందున ఆయన విచారణ చేసుకోవచ్చని పేర్కొన్నారు. తన వియ్యంకుడు భాస్కర్ రెడ్డి విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారని… ఆయన భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపణ చేయడంతో పాటు.. తాజాగా నిరాధారమైన ఆరోపణ చేస్తున్నారని పేర్కొన్నారు. కొందరు టీడీపీ నేతలు పసలేని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.