మలయాళంలో గత కొన్నేళ్లలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లలో నాయట్టు ఒకటి. గత దశాబ్ద కాలంలో దక్షిణాదిన వెలుగులోకి వచ్చిన ఉత్తమ నటుల్లో ఒకడైన జోజు జార్జ్‌తో పాటు కుంచుకో బోబన్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. మన వ్యవస్థలో లోపాలను కళ్లకు కట్టేలా చూపిస్తూ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ సాగే ఈ సినిమా.. చూసిన ప్రేక్షకులను చాన్నాళ్లు వెంటాడుతుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు గత ఏడాది వార్తలు వచ్చాయి.
రావు రమేష్‌ను జోజు జార్జ్ పాత్రకు ఎంపిక చేయడం.. కరుణ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గీతా ఆర్ట్స్ సంస్థ సన్నాహాలు చేయడం గురించి జోరుగా వార్తలు వచ్చాయి. మరి కొన్ని రోజుల్లో షూటింగ్ కూడా మొదలవుతుందని అన్నారు. కానీ ఇంతలో ఏమైందో ఏమో.. ఆ సినిమా ఆగిపోయింది.
నాయట్టు లాంటి సినిమాను తెలుగులో రీమేక్ చేయడం సరైన ఆలోచన కాదని, ఆ సినిమా ఇక్కడ వర్కవుట్ కాదని ఆపేశారేమో అనుకున్నారు. కానీ కొంచెం గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ ఆ సినిమా తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా కాస్టింగ్ విషయంలో కీలక మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. జోజు జార్జ్ పాత్రకు రావు రమేష్‌ను కాకుండా సీనియర్ నటుడు శ్రీకాంత్‌ను ఎంచుకున్నారట. నిమిష పాత్రకు శివాత్మిక రాజశేఖర్, కుంచుకో బోబన్ క్యారెక్టర్‌కు రాహుల్ విజయ్‌లను తీసుకున్నారట. సినిమాలో కీలకమైన లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రను వరలక్ష్మి శరత్ కుమార్‌తో చేయిస్తున్నారట.
ఈ సినిమాకు కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు సమాచారం. కరుణ్ కుమారే సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు అనుకున్న దాని కంటే తక్కువ బడ్జెట్లో ఈ సినిమాను తీస్తున్నారట. ఆల్రెడీ షూటిగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.